Shreyas Iyer: రాహుల్‌ రికార్డును బ్రేక్‌ చేసిన అయ్యర్ 

23 Jul, 2022 13:02 IST|Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా  మిడిలార్డర్‌ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 54 పరుగులు చేసి కెరీర్‌లో 10వ అర్ధశతకాన్ని నమోదు చేసిన అయ్యర్‌.. వన్డేల్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో అతను స్టార్‌ ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ రికార్డును బ్రేక్‌ చేసి భారత మాజీ ఓపెనర్‌ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతో సమంగా నిలిచాడు.

శ్రేయస్‌, సిద్దూలు 25 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మార్కును చేరుకోగా.. రాహుల్‌కు ఈ మైలురాయిని చేరుకునేందుకు 27 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్‌లు సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 24 ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మార్కును చేరుకున్నారు.  

ఇదిలా ఉంటే, విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేయగా.. ఛేదనలో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేయగలిగింది.

భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (97) మూడు పరుగుల తేడాతో శతకం చేజార్చుకోగా, శుభ్‌మన్‌ గిల్‌ (64), శ్రేయస్‌ (54) అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్‌ బ్యాటర్లలో కైల్‌ మేయర్స్‌ (75), బ్రాండన్‌ కింగ్‌ (54) హాఫ్‌ సెంచరీలు నమోదు చేయగా ఆఖర్లో అకీల్‌ హొసేన్‌ (32 నాటౌట్‌), రొమారియో షెపర్డ్‌ (39 నాటౌట్‌) విండీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. 
చదవండి: టీమిండియాతో వన్డే సిరీస్‌.. వెస్టిండీస్‌కు బిగ్‌ షాక్‌..!

 

మరిన్ని వార్తలు