'హార్దిక్ వద్దు.. టీమిండియా వన్డే కెప్టెన్సీకి వారిద్దరే సరైనోళ్లు'

29 Jan, 2023 15:34 IST|Sakshi

టీమిండియా త్వరలోనే స్ప్లిట్ కెప్టెన్సీ (వేర్వేరు కెప్టెన్‌ల)ని కాన్సెప్ట్‌ను ఆచరణకు తీసుకోచ్చే అవకాశం ఉంది అని భారత మాజీ క్రికెటర్ ఆకాష్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మ తప్పుకోనున్నాడని చోప్రా జోస్యం చెప్పాడు. కాగా ఇప్పటికే టీ20ల్లో రోహిత్‌ స్థానంలో పూర్తి స్థాయి జట్టు ​కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే.

ఇం‍దులో భాగంగానే టీ20 ప్రపం‍చకప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి రోహిత్‌ దూరంగా ఉన్నాడు. రోహిత్ ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రమే సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అదే విధంగా ప్రస్తుతం టీ20ల్లో భారత కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హార్దిక్‌ పాండ్యాకు వన్డేల్లో మాత్రం జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం లేదని చోప్రా తెలిపాడు.

"త్వరలో భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్‌లను చూడబోతున్నాం. అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌ ఉండే రోజులు ముగిశాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ వరకు రోహిత్‌ టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగుతాడు. అదే విధంగా ప్రస్తుతం టీ20ల్లో కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా ఉన్నాడు. ఇదే ఫార్మాట్‌లో హార్దిక్‌ను సారథిగా మరి కొం‍త కాలం కొనసాగిస్తారని భావిస్తున్నాను. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్‌గా హార్దిక్‌ బాధ్యతలు నిర్వహించడం మనం చూస్తాం.

ఇక 2023 వన్డే ప్రపంచకప్‌ అనంతరం వన్డే ఫార్మాట్‌లో కూడా భారత జట్టుకు కొత్త కెప్టెన్‌ రానున్నాడు. హార్దిక్‌కు మాత్రం వన్డేల్లో జట్టు పగ్గాలు అప్పగించే సూచనలు కనిపించడం లేదు. అయితే యువ ఆటగాళ్లు శుబ్‌మాన్‌ గిల్‌, రిషబ్ పంత్‌లు వన్డే కెప్టెన్సీ రేసులో ఉంటారు. నా వరకు అయితే వీరిద్దరికి భారత జట్టును విజయపథంలో నడిపించే సత్తా ఉంది" అని  జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: IND VS NZ 2nd T20: టీమిండియాలో రెండు మార్పులు..? అర్షదీప్‌తో పాటు..!

మరిన్ని వార్తలు