గిల్‌లో అద్బుతమైన టాలెంట్‌ ఉంది.. కచ్చితంగా లెజెండ్స్‌ సరసన చేరుతాడు: కపిల్‌ దేవ్‌

31 May, 2023 12:50 IST|Sakshi

ఐపీఎల్‌-2023లో టీమిండియా యువ ఓపెనర్‌ , గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఆటగాడు దుమ్మురేపిన సంగతి తెలిసిందే.  ఈ ఏడాది సీజన్‌లో 890 పరుగులు చేసిన గిల్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ విన్నర్‌గా నిలిచాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌లతో మరోసారి ప్రపంచ క్రికెట్‌కు తన టాలెంట్‌ ఎంటో చూపించాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో గిల్‌ మూడు సెంచరీలతో పాటు నాలగు హాఫ్‌సెంచరీలు సాధించాడు. అదే విధంగా ఐపీఎల్‌ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన గిల్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం  కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

గిల్‌ తన ఆటతీరుతో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను గుర్తుచేస్తున్నాడని కపిల్‌ దేవ్‌ కొనియాడాడు. అయితే గిల్‌ మరింత మెరుగుపడడానికి మరో ఏడాది సమయం అవసరమని కపిల్‌దేవ్‌ అభిప్రయపడ్డాడు. "భారత్‌ క్రికెట్ ప్రపంచానికి ఎంతోమంది లెజెండ్స్‌ను పరిచయం చేసింది. వారిలో సునీల్‌ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు శుబ్‌మన్‌ గిల్‌ కూడా వారి అడుగుజాడల్లో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

కానీ ఇప్పుడే అతడిని ఆకాశానికి ఎత్తేయకూడదు అనుకుంటున్నాను. గిల్‌లో అద్భుతమైన టాలెంట్‌ ఉంది. కానీ అతడికి ఇంకా మరింత మెచ్యూరిటీ కావాలి. అతడు వచ్చే ఏడాది సీజన్‌లో కూడా ఇలాగే ఆడితే.. కచ్చితంగా  గొప్ప ఆటగాళ్ల జాబితాలోకి చేరుతాడు. అతడు మరింత మెరుగుపడడానికి మరో ఏడాది సమయం అవసరమని" ఏబీపీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.


చదవండి: IRE vs ENG: ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్‌ తుది జట్టు ఇదే! స్టార్‌ క్రికెటర్‌ వచ్చేశాడు

మరిన్ని వార్తలు