Shubman Gill: 'డెబ్యూ సెంచరీ నాన్నకు అంకితం'.. గిల్‌ ఎమోషనల్‌ 

23 Aug, 2022 08:42 IST|Sakshi

టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ జింబాబ్వేతో మూడో వన్డేలో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా గిల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే డెబ్యూ సెంచరీ. 97 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 130 పరుగులు చేసి జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. సెంచరీ గండంతో అల్లాడిపోయిన గిల్‌ ఎట్టకేలకు సెంచరీ మార్క్‌ను అందుకోవడంతో సంతోషంలో ముగినిపోయాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన గిల్‌ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు.

''టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా.. ఎందుకంటే కొంతమంది సీనియర్‌ క్రికెటర్లతో బ్యాటింగ్‌ పంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే నా ఆటకు ప్రాథమిక గైడ్‌.. కోచ్‌ ఎవరో కాదు నా తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌. ఇవాళ సాధించిన సెంచరీ నాన్నకు అంకితమిస్తున్నా. రెండో వన్డేలో 33 పరుగుల వద్ద ఔటైనప్పుడు నాన్న నుంచి ఫోన్‌ వచ్చింది. నీ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు.. ఆటపై సరిగ్గా దృష్టి పెట్టు.. అద్భుతాలు సాధిస్తావు అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఇవాళ సెంచరీతో మెరిశాను.

ఇక జింబాబ్వే చిన్న జట్టయినా అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా మూడో వన్డేలో అటు బౌలింగ్‌లో బ్రాడ్‌ ఎవన్స్‌.. బ్యాటింగ్‌లో సెంచరీతో మెరిసిన సికందర్‌ రజాకు నా అభినందనలు. అందరూ ఆడుతున్న సమయంలో బాదడం కంటే  క్లిష్ట సమయంలో సెంచరీతో ఆడడం అసలైన ఆటగాడిని వెలికితీస్తుంది. వీరిద్దరికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక మూడుసార్లు తొంబైల స్కోరు అందుకున్నప్పటికి సెంచరీ సాధించలేకపోయా. అందుకే ఈ సెంచరీ నాకు స్పెషల్‌'' అంటూ చెప్పుకొచ్చాడు. 

జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి 245 పరుగులు చేసిన గిల్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలవడం విశేషం. గిల్‌కు ఇది వరుసగా రెండో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ కాగా.. ఇంతకముందు విండీస్‌పై వన్డే సిరీస్‌లోనూ ఈ అవార్డు అందుకున్నాడు.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్‌(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్‌ కిషన్‌(50), ధావన్‌(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్‌ సాధించారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది.. తద్వారా భారత్‌ చేతిలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

చదవండి: Sikandar Raza: పాక్‌ మూలాలున్న బ్యాటర్‌.. అయినా సరే మనసు దోచుకున్నాడు

IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డు బద్దలు!

మరిన్ని వార్తలు