ఎలా ఔటయ్యాడో చూడు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు.. గిల్‌ తండ్రి అసంతృప్తి

19 Jan, 2023 18:12 IST|Sakshi

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 18) జరిగిన వన్డేలో టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీతో (149 బంతుల్లో 209; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు గిల్‌ శ్రీలంకపై మూడో వన్డేలో సెంచరీ సాధించిన అనంతరం అతని తండ్రి లఖ్విందర్‌ గిల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

గిల్‌ సహచరుడు, పంజాబ్‌ ఆటగాడు గురుకీరత్‌ సింగ్‌ మాన్‌ కథనం మేరకు.. శ్రీలంకపై గిల్‌ సెంచరీ సాధించాక ఔటైన విధానంపై లఖ్విందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడట. లఖ్విందర్‌ గురుకీరత్‌తో మాట్లాడుతూ.. మంచి ఆరం‍భం లభించాక సెంచరీ చేశాడు, ఓకే.. డబుల్‌ సెంచరీ చేసే అవకాశం ఉన్నా, ఎలా ఔటయ్యాడో చూడు.. ఇలాంటి అవకాశాలు ప్రతిసారి రావు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు అని అన్నాడట.

లఖ్విందర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు గిల్‌ కివీస్‌పై డబుల్‌ సెంచరీ చేశాక సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. తండ్రి మందలింపును ఛాలెంజ్‌గా తీసుకుని గిల్‌ డబుల్‌ సెంచరీ కొట్టాడు అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటి తండ్రి గైడెన్స్‌లో పెరిగే క్రికెటర్లు అద్భుతాలు సృష్టిస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, 2021 ఆస్ట్రేలియా పర్యటనలో (గబ్బా టెస్ట్‌లో) గిల్‌ 91 పరుగుల వద్ద ఔటయ్యాక కూడా లఖ్విందర్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడట. గిల్‌పై చిన్నప్పటి నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకున్న లఖ్విందర్‌.. గిల్‌ అనవసర షాట్లు ఆడి వికెట్‌ సమర్పించుకుంటే అస్సలు ఒప్పుకునే వాడు కాదట. వన్డేల్లో జింబాబ్వేపై తన తొలి సెంచరీ చేసిన సందర్భంగా గిల్‌.. ఈ విషయాలు స్వయంగా వెల్లడించాడు.

అంతకుమందు మ్యాచ్‌లో 33 పరుగుల వద్ద ఔటైనప్పుడు తన తండ్రి కొట్టినంత పని చేశాడు.. అందుకే ఈ సెంచరీ నా తండ్రికి అంకితం అంటూ తొలి వన్డే సెంచరీ అనంతరం పోస్ట్‌ మ్యాచ్‌ ప్రజెంటేషన్‌ సందర్భంగా గిల్‌ పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో టీమిండియా అతికష్టం మీద 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంకర శతకంతో గడగడలాడించినప్పటికీ, ఆఖరి ఓవర్‌లో అతను ఔట్‌ కావడంతో టీమిండియా విజయం సాధించగలిగింది. 

మరిన్ని వార్తలు