టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో యువ ఓపెనర్ ఔట్..?

1 Jul, 2021 15:40 IST|Sakshi

లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు ప్రముఖ వార్త సంస్థ పీటీఐకి తెలియజేశారు. 21 ఏళ్ల గిల్‌.. కాలి పిక్క కండరాల్లో గాయంతో బాధపడుతున్నాడని, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో శస్త్రచికిత్స చేయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో అతను ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఆయన వెల్లడించారు. అయితే, గిల్ గాయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

మరోవైపు గిల్‌కు ప్రత్యామ్నాయంగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌, హనుమ విహారిలతో పాటు అభిమన్యు ఈశ్వరన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ గిల్‌ ప్రస్తుతం ఫిజియో నితిన్‌ పటేల్‌ పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు మరో నెల రోజుల గడువు ఉన్న నేపథ్యంలో గిల్‌, గాయం నుంచి కోలుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. టెంట్ బ్రిడ్జ్‌లో ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ సెకండ్ ఎడిషన్ ప్రారంభంకానుంది. కాగా, శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు 8 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతనిధ్యం వహించాడు. 3 అర్ధశతకాల సాయంతో 31.84 సగటుతో 414 పరుగులు చేశాడు. 
 

మరిన్ని వార్తలు