Shubman Gill: శుబ్‌మన్‌ గిల్‌ సంచలన నిర్ణయం! టైటాన్స్‌కు గుడ్‌ బై! వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా!

20 Jun, 2023 16:20 IST|Sakshi

IPL 2024- Shubman Gill: ఐపీఎల్‌-2023లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌. గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ హ్యాండ్సమ్‌ బ్యాటర్‌ 17 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 890 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా మూడు సెంచరీలు, 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం.

టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఈ పంజాబ్‌ క్రికెటర్‌ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఆరెంజ్‌ క్యాప్‌తో పాటు మరెన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను మరోసారి ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

టీమిండియా భవిష్యత్‌ కెప్టెన్‌
ఇక​ మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా ఓపెనర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న 23 ఏళ్ల శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. గిల్‌ భవిష్యత్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉందంటూ ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అతడి నైపుణ్యాలను కొనియాడుతున్నారు.

ఈ నేపథ్యంలో శుబ్‌మన్‌ గిల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న సీజన్‌లో అతడు గుజరాత్‌ టైటాన్స్‌ గుడ్‌ బై చెప్పనున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఐపీఎల్‌-2024లో గిల్‌ కొత్త జట్టుకు మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గిల్‌ ఎందుకు టైటాన్స్‌ను వీడాలనుకుంటున్నాడు?
గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌-2022 సీజన్‌లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గతంలో కెప్టెన్సీ అనుభవం లేని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను సారథిగా నియమించగా.. అరంగేట్ర సీజన్‌లోనే జట్టును విజేతగా నిలిపి చరిత్ర సృష్టించాడతడు.

తాజా ఎడిషన్‌లోనూ గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చి సత్తా చాటాడు పాండ్యా. ఇక 29 ఏళ్ల పాండ్యా ప్రస్తుతం భారత పరిమిత ఓవర్ల కెప్టెన్‌ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ అనుకూలిస్తే అతడు మరో 7-8 ఏళ్ల పాటు గుజరాత్‌ సారథిగా కూడా కొనసాగుతాడనడంలో సందేహం లేదు.

పంజాబ్‌ లేదంటే సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా!
అదే జరిగితే.. కీలక బ్యాటర్‌గా ఉన్న శుబ్‌మన్‌ ఆటగాడిగా కొనసాగుతాడే తప్ప కెప్టెన్‌ అయ్యే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో అతడు గుజరాత్‌ను వీడి కొత్త జట్టులో చేరాలనుకుంటున్నట్లు సమాచారం.

కెప్టెన్‌ కావాలని ఆశ పడుతున్న శుబ్‌మన్‌.. సొంత రాష్ట్రానికి చెందిన పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ లేదంటే.. సరైన సారథి కోసం ఎదురు చూస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడాలని భావిస్తున్నాడట. ఇప్పట్లో గుజరాత్‌ టైటాన్స్‌ పగ్గాలు చేపట్టే అవకాశం లేదు కాబట్టి ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట.

రోహిత్‌, హార్దిక్‌ మాదిరే!
ముంబై బ్యాటర్‌ అయిన రోహిత్‌ శర్మ సొంత జట్టు ముంబై ఇండియన్స్‌కు సారథిగా కొనసాగుతుండగా.. హార్దిక్‌ పాండ్యా సైతం స్వరాష్ట్ర ఫ్రాంఛైజీ కెప్టెన్‌న్ఘున్నాడు. వీళ్ల మాదిరే తాను సైతం పంజాబ్‌ జట్టు నాయకుడు కావాలని గిల్‌ ఆశపడుతున్నాడట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తలంపుతో సూపర్‌ ఫామ్‌లో ఉన్నపుడే తనకున్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవాలన్నదే గిల్‌ సంకల్పమట. 

ఏదేమైనా గుజరాత్‌ టైటాన్స్‌ టాప్‌ బ్యాటర్‌గా ఉన్న శుబ్‌మన్‌ ఆ జట్టును వీడితే మాత్రం వాళ్లకు కష్టాలు తప్పవు. ఒకవేళ నిజంగానే గిల్‌ టైటాన్స్‌తో బంధం తెంచుకుంటాడా? లేదంటే అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతాడా అన్న అంశంపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఊహాగానాలు తప్పవు!!

చదవండి: రోహిత్‌ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే..
2014లో పెళ్లి.. ఇంత పెద్ద కూతురు ఎలా? హీరోయిన్‌లా ఉంది! ఎంతైనా..

మరిన్ని వార్తలు