కోహ్లిని మించిన కెప్టెన్‌ లేడు.. కింగ్‌ను ఆకాశానికెత్తిన రైజింగ్‌ స్టార్‌

20 Nov, 2022 10:17 IST|Sakshi

Shubman Gill On Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై రైజింగ్‌ స్టార్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఆడిన కెప్టెన్లలో కోహ్లిని మించిన కెప్టెన్‌ లేడని కింగ్‌ను ఆకాశానికెత్తాడు. తాను వ్యక్తిగతంగా కోహ్లి కెప్టెన్సీని బాగా ఎంజాయ్‌ చేశానని, అతను జట్టు సభ్యులను మోటివేట్‌ చేసే విధానం తనకు బాగా నచ్చుతుందని, కోహ్లి.. ఆటగాళ్లలో కసి రగుల్చుతాడని, అందుకే తనకు కోహ్లి కెప్టెన్సీ అంటే ఇష్టమని కింగ్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. 

కాగా, శుభ్‌మన్‌ గిల్‌ 2019లో కోహ్లి కెప్టెన్‌గా ఉండగానే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే అతను అరంగేట్రానికి ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది. 2020 ఆస్ట్రేలియా పర్యటనలో గిల్‌.. అజింక్య రహానే కెప్టెన్సీలో టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో 91 పరుగులు చేసిన గిల్‌.. టీమిండియా చారిత్రక గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గిల్‌.. తానాడిన 11 మ్యాచ్‌ల్లోనే కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా, కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలో టీమిండియాకు ఆడాడు. 

ఇదిలా ఉంటే, గిల్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్‌లు (11), వన్డేలు (12) మాత్రమే ఆడిన గిల్‌కు ఈ సిరీస్‌లో టీ20 అరంగేట్రం చేసే అవకాశం దొరకవచ్చు. 2018 అండర్‌-19 వరల్డ్‌కప్‌తో వెలుగులోకి వచ్చిన గిల్‌.. ఆతర్వాత దేశవాలీ, ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. టెస్ట్‌లు, వన్డేలు కలిపి ఇప్పటివరకు గిల్‌ ఖాతాలో సెంచరీ, 7 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. గిల్‌.. ఐపీఎల్‌లో 74 మ్యాచ్‌ల్లో 125 స్ట్రయిక్‌ రేట్‌తో 1900 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు