Ind Vs Aus 4th Test: కరువు తీరింది... సెంచరీల దరువు! ఈసారి శుబ్‌మన్‌ వంతు

12 Mar, 2023 01:35 IST|Sakshi

శతకం బాదిన గిల్‌  

తొలి ఇన్నింగ్స్‌లో బారత్‌ 289/3 

రాణించిన కోహ్లి 

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ చివరి టెస్టు  

India vs Australia, 4th Test- అహ్మదాబాద్‌: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు పరుగుల కరువును తీర్చడమే కాదు... సెంచరీల దరువుతో సాగుతోంది. మోదీ స్టేడియంలో వరు సగా మూడో రోజూ శతకం నమోదైంది. భారత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (235 బంతుల్లో 128; 12 ఫోర్లు, 1 సిక్స్‌) మూడంకెల స్కోరు చేయడంతో భారత్‌ దీటైన జవాబిస్తోంది.

శనివారం ఆట నిలిచే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 99 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఇంకా 191 పరుగులు వెనుకబడినప్పటికీ భారత్‌ చేతిలో 7 వికెట్లుండటం సానుకూలాంశం. అన్నింటికి మించి చాన్నాళ్ల తర్వాత విరాట్‌ కోహ్లి (128 బంతుల్లో 59 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) టెస్టుల్లో అర్ధసెంచరీతో ఆకట్టుకోవడం భారత శిబిరంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.  

రోహిత్‌ నిరాశ 
ఓవర్‌నైట్‌ స్కోరు 36/0తో ఆట కొనసాగించిన భారత ఇన్నింగ్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ 11 ఓవర్లపాటు నడిపించారు. అయితే క్రీజ్‌లో నిలదొక్కుకొని భారీ స్కోరు చేసేలా కనిపించిన దశలో కెప్టెన్‌ రోహిత్‌ (58 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అవుటై నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

కునెమన్‌ ఈ ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాత గిల్, పుజారా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. 90 బంతుల్లో గిల్‌ అర్ధసెంచరీ పూర్తయింది. కెపె్టన్‌ స్మిత్‌ స్పిన్నర్లు, పేసర్లను అదేపనిగా మార్చినా లాభం లేకపోయింది. 129/1 స్కోరు వద్ద లంచ్‌ విరామానికి వెళ్లగా, తొలిసెషన్‌లో భారత్‌ వికెట్‌ నష్టానికి 93 పరుగులు చేయగలిగింది.  

కోహ్లి అర్ధసెంచరీ 
క్రీజులో పాతుకుపోయినప్పటికీ పుజారాతో పాటు శుబ్‌మన్‌ కూడా అనవసర షాట్ల జోలికెళ్లకుండా బ్యాటింగ్‌ చేశారు. ఈ సెషన్‌లో ఇద్దరు నింపాదిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. కానీ ఆసీస్‌ శిబిరాన్ని గిల్‌–పుజారా జోడి నిరాశలో ముంచింది. ఇదే క్రమంలో గిల్‌ 194 బంతుల్లో టెస్టుల్లో రెండో శతకాన్ని సాధించాడు. ఈ ఏడాది జోరుమీదున్న గిల్‌ ఈ రెండున్నర నెలల్లోపే ఐదో సెంచరీ (మూడు ఫార్మాట్‌లలో కలిపి) సాధించడం విశేషం.

మరో వైపు పుజారా (121 బంతుల్లో 42; 3 ఫోర్లు) అర్ధ సెంచరీకి చేరువవుతున్న దశలో మర్ఫీ అతన్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పుజారా రివ్యూ చేసినా లాభం లేకపోయింది. దీంతో రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి క్రీజులోకి రాగా 188/2 స్కోరు వద్ద టీ బ్రేక్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆఖరి సెషన్‌లో గిల్, కోహ్లిలు తమదైన శైలిలో ఆ్రస్టేలియా బౌలర్లను ఎదుర్కొన్నారు.

ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 58 పరుగులు జతచేశాక జట్టు స్కోరు 245 పరుగుల వద్ద లయన్‌... శుబ్‌మన్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అతన్ని ఎల్బీగా పెవిలియన్‌ చేర్చాడు. గిల్‌ ని్రష్కమించినప్పటికీ మూడో సెషన్‌లో భారత్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. జడేజా, కోహ్లిల జోడీ కుదురుకోవడంతో ఈ సెషన్‌లోనే  101 పరుగులు వచ్చాయి.

ఈ క్రమంలోనే విరాట్‌ 107 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో అర్ధసెంచరీ తర్వాత మళ్లీ ఇంతకాలానికి అతను ఫిఫ్టీ బాదాడు. ఈ 14 నెలల వ్యవధిలో ఇంటా బయటా 8 టెస్టులాడిన విరాట్‌  చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. ఆట నిలిచే సమయానికి కోహ్లి, జడేజా (16 బ్యాటింగ్‌; 1 సిక్స్‌) క్రీజులో ఉన్నారు.

స్కోరు వివరాలు 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 480 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) లబుõషేన్‌ (బి) కునెమన్‌ 35; గిల్‌ (ఎల్బీ) (బి) లయన్‌ 128; పుజారా (ఎల్బీ) (బి) మర్ఫీ 42; కోహ్లి బ్యాటింగ్‌ 59; జడేజా బ్యాటింగ్‌ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (99 ఓవర్లలో 3 వికెట్లకు) 289. వికెట్ల పతనం: 1–74, 2–187, 3–245. బౌలింగ్‌: స్టార్క్‌ 17–2–74–0, గ్రీన్‌ 10–0–45–0, లయన్‌ 37–4–75–1, కునెమన్‌ 13–0–43–1, మర్ఫీ 22–6–45–1.  

మరిన్ని వార్తలు