Virat Kohli: నెక్ట్స్ సూపర్‌స్టార్‌.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: టీమిండియా మాజీ స్టార్‌

21 Sep, 2023 17:48 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- శుబ్‌మన్‌ గిల్‌

ICC ODI WC 2023: టీమిండియా ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ గురించి మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్‌ మరో విరాట్‌ కోహ్లి అవ్వాలని కోరుకుంటున్నాడని.. అందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తున్నాడని ప్రశంసించాడు. 

అద్భుతమై షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించడం అతడికి అలవాటుగా మారిపోయిందంటూ కొనియాడాడు. గిల్‌ క్రీజులో ఉన్నాడంటే స్పిన్నర్లైనా.. పేసర్లైనా ఆచితూచి బంతిని విసరాల్సిందేనంటూ గిల్‌ ఆట తీరును మెచ్చుకున్నాడు. 

వన్డే వరల్డ్‌కప్‌-2023 ముగిసిన తర్వాత క్రికెట్‌ ప్రేమికులంతా గిల్‌ గురించి మాట్లాడుకోవడం ఖాయమంటూ అతడిని ఆకాశానికెత్తాడు. కాగా 2019లో న్యూజిలాండ్‌తో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన గిల్‌.. అనతికాలంలోనే భారత జట్టు స్టార్‌ ఓపెనర్‌గా ఎదిగాడు.

రోహిత్‌కు జోడీగా జట్టులో పాతుకుపోయి
కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా పాతుకుపోయి.. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ ముఖ్యమైన సభ్యుడిగా మారిపోయాడు. ఇక ఆసియా కప్‌-2023లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న గిల్‌.. ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ క్రమంలో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌లో 24 ఏళ్ల శుబ్‌మన్‌ గిల్‌ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సురేశ్‌ రైనా జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్‌లో అత్యంత ముఖ్యమైన ప్లేయర్లలో అతడూ ఒకడు.

తదుపరి సూపర్‌స్టార్‌.. మరో కోహ్లి
భారత క్రికెట్‌లో తదుపరి సూపర్‌స్టార్‌ కావాలని.. మరో విరాట్‌ కోహ్లి కావాలని తను కోరుకుంటున్నాడు. అందుకు తగ్గట్లుగా పక్కాగా ప్రణాళికలు అమలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. బలంగా బంతిని బాదడం అతడి నైపుణ్యాలకు నిదర్శనం.

స్పిన్నర్లు.. లేదంటే ఫాస్ట్‌బౌలర్లు.. ఎవరైనా సరే గిల్‌ క్రీజులో ఉంటే బాల్‌ ఎక్కడ వేయాలా అని తలలు పట్టుకోవాల్సిందే! అతడు ఇక్కడితో ఆగిపోడు. 2019లో రోహిత్‌ టీమిండియా తరఫున ఎలా ఆడాడో చూశాం కదా!

పుట్టుకతోనే తనొక లీడర్‌
ఈసారి గిల్‌ కూడా అదే పనిచేస్తాడు. జన్మతః గిల్‌ లీడర్‌.. ఆ విషయాన్ని తన ఆటతో ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాడు. గత కొంతకాలంగా అతడు నిలకడగా ఆడుతున్నాడు. అయితే, వెస్టిండీస్‌తో సిరీస్‌లో కాస్త నిరాశపరిచాడు.

అయితే, ఆసియా కప్‌తో మళ్లీ తన సత్తా చాటాడు. ఫుట్‌వర్క్‌ బాగుంది. చాలా మెరుగయ్యాడు. సునాయాసంగా 50లు, 100లు బాదగల స్థాయికి చేరుకున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌కప్‌-2023లో అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అంతకంటే ముందు.. సెప్టెంబరు 22- 27 వరకు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో పాల్గొననుంది. ఇదిలా ఉంటే.. కోహ్లి తన రోల్‌ మోడల్‌ అని గిల్‌ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

చదవండి: ఒక్కటీ గెలవలేదు.. హోదా ఇచ్చి తప్పుచేశారు! అన్నిటికంటే చెత్త విషయం ఇదే..

మరిన్ని వార్తలు