ISSF World Cup 2023: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం

27 Mar, 2023 10:55 IST|Sakshi

భోపాల్‌: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌ను భారత్‌ కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం భారత్‌ ఖాతా లో ఒక కాంస్య పతకం చేరింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో సిఫ్ట్‌ కౌర్‌ సామ్రా మూడో స్థానంలో నిలిచింది. ఎంబీబీఎస్‌ చదువుతోన్న పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల సిఫ్ట్‌ కౌర్‌ క్వాలిఫయింగ్‌లో 588 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్‌ రౌండ్‌కు అర్హత సాధించింది.

ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో సిఫ్ట్‌ కౌర్‌ 403.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. సిఫ్ట్‌ కౌర్‌కిది రెండో ప్రపంచకప్‌ పతకం. గత ఏడాది కొరియాలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఆమె కాంస్య పతకం సాధించింది.

సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా భారత్‌ ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. చైనా ఎనిమిది స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకుంది.
చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్‌ బ్యాటర్‌ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

మరిన్ని వార్తలు