IND Vs NZ: 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది'

18 Nov, 2022 17:40 IST|Sakshi

టి20 సిరీస్‌లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి టి20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. టాస్‌ వేయడానికి కూడా అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ రద్దు చేసేందుకే అంపైర్లు మొగ్గుచూపారు. అలా తొలి మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడం అభిమానులను బాధించింది. ఆ తర్వాత టీమిండియా, న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కలిసి ఫుట్‌వాలీ పేరుతో ఏకకాలంలో ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది.

ఈ సంగతి పక్కనబెడితే.. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సైమన్‌ డౌల్‌  మాత్రం స్కై స్టేడియం సిబ్బందిని ఎండగట్టాడు. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సైమన్‌ డౌల్‌ స్టేడియంలో ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఫోటోను షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేయడం ఆసక్తి కలిగించింది. ఆ ఫోటోలో ఒక మసి గుడ్డను కుర్చీపై ఉంచాడు.

''ఇప్పుడే కామెంటరీ ఏరియాలో ఉన్న కుర్చీలకు పట్టిన దుమ్మును మొత్తం క్లీన్‌ చేశా. స్కై స్టేడియం సిబ్బంది ఎంత మంచి పనిమంతులనేది ఈ ఒక్క విషయంతో అర్థమయింది. అయినా ఇప్పుడు ఆ కుర్చీలన్నీ గుడ్డతో క్లీన్‌ చేశాను. ఇక ప్యానెల్‌కు వచ్చే విదేశీ గెస్టులు దర్జాగా వచ్చి ఆ కుర్చీల్లో కూర్చోవచ్చు. నిజంగా ఇది సిగ్గుచేటు.. కనీసం కుర్చీలను కూడా క్లీన్‌ చేయలేదు.. ఇది భరించకుండా ఉంది. వర్షంతో మ్యాచ్‌ రద్దు అవుతుందని ముందే ఊహించి కనీస ఏర్పాట్లు కూడా సరిగా చేయలేకపోయారు'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం సైమన్‌ డౌల్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వర్షంతో తొలి టి20 రద్దు కాగా.. ఇరుజట్ల ఆటగాళ్లు మౌంట్‌ మాంగనూయ్‌కు బయలుదేరారు. ఆదివారం(నవంబర్‌ 20న) కివీస్‌, టీమిండియాల మధ్య రెండో టి20 మ్యాచ్‌ జరగనుంది.

చదవండి: FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు'

వర్షంతో మ్యాచ్‌ రద్దు.. వింత గేమ్‌ ఆడిన భారత్‌, కివీస్‌ ఆటగాళ్లు 

మరిన్ని వార్తలు