సంప్రాస్‌ సరసన జొకోవిచ్‌

8 Nov, 2020 06:29 IST|Sakshi

అత్యధికసార్లు టాప్‌ ర్యాంక్‌తో సీజన్‌ను ముగించిన ప్లేయర్‌గా రికార్డు సమం

పారిస్‌: ఈ ఏడాది అద్భుతంగా రాణించిన సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తన చిన్ననాటి ఆరాధ్య క్రీడాకారుడు పీట్‌ సంప్రాస్‌ సరసన నిలిచాడు. అత్యధికసార్లు పురుషుల టెన్నిస్‌ సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా ఇన్నాళ్లూ సంప్రాస్‌ పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు. గతంలో సంప్రాస్‌ 1993 నుంచి 1998 వరకు వరుసగా ఆరేళ్లపాటు సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్‌గా ముగించాడు. 33 ఏళ్ల జొకోవిచ్‌ 2011, 2012, 2014, 2015, 2018, 2020 సీజన్‌లను టాప్‌ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్‌ సరసన చేరాడు.

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ (20 చొప్పున) సాధించిన మేటి క్రీడాకారులు రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) గతంలో ఐదుసార్లు చొప్పున సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించారు. గతేడాది వరకు ఫెడరర్, నాదల్‌ సరసన నిలిచిన జొకోవిచ్‌ ఈ ఏడాది వారిద్దరిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్లిపోయాడు. కరోనా వైరస్‌ కారణంగా కుదించిన ఈ టెన్నిస్‌ సీజన్‌లో జొకోవిచ్‌ మొత్తం 39 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. అంతేకాకుండా నాలుగు టైటిల్స్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ‘టెన్నిస్‌ రాకెట్‌ పట్టినప్పటి నుంచి సంప్రాస్‌ను ఆరాధించేవాణ్ని. ఇప్పుడు అతని రికార్డును సమం చేసినందుకు నా కల నిజమైంది’ అని జొకోవిచ్‌ అన్నాడు.

కెరీర్‌లో 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన జొకోవిచ్‌ గత సెప్టెంబర్‌లో అత్యధిక వారాలు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాలో సంప్రాస్‌ (286 వారాలు)ను మూడో స్థానానికి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటికే 294 వారాలు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న జొకోవిచ్‌ వచ్చే సీజన్‌లోనూ నిలకడగా ఆడితే మార్చి తొలి వారంలో... అత్యధిక వారాలు నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న ప్లేయర్‌ ఫెడరర్‌ (310 వారాలు) రికార్డును కూడా బద్దలు కొడతాడు. నవంబర్‌ 15న లండన్‌లో మొదలయ్యే సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో జొకోవిచ్‌ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా సీజన్‌ను టాప్‌ ర్యాంక్‌తో ముగించినందుకు అతనికి అధికారిక ట్రోఫీని ప్రదానం చేస్తారు.

మరిన్ని వార్తలు