కొత్త దారిని ఎంచుకున్నందుకు...

24 Jan, 2021 05:17 IST|Sakshi
తండ్రి సుందర్‌తో భారత యువ క్రికెటర్‌ వాషింగ్టన్‌

భారత యువ క్రికెటర్లకు ఆనంద్‌ మహీంద్రా ‘థార్‌ ఎస్‌యూవీ’ కానుక

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో ఆరుగురు కొత్త కుర్రాళ్లు కీలకపాత్ర పోషించారు. సిరాజ్, శుబ్‌మన్‌ గిల్, నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్, నటరాజన్‌లు ఇదే సిరీస్‌లో అరంగేట్రం చేయగా, శార్దుల్‌ ఠాకూర్‌కు కూడా బ్రిస్బేన్‌ మ్యాచ్‌ దాదాపు తొలి టెస్టులాంటిదే. వీరి ప్రదర్శనను అభినందిస్తూ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తన తరఫు నుంచి ప్రత్యేకంగా జీప్‌లను కానుకలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రికెటర్లకు కొత్త మోడల్‌ ‘థార్‌–ఎస్‌యూవీ’లు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రూ. 13 లక్షలు విలువ చేసే థార్‌–ఎస్‌యూవీ జీప్‌ను మహీంద్రా సంస్థ నుంచి కాకుండా తన సొంత డబ్బులతో వీటిని ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

‘భవిష్యత్తులో భారత యువకులు పెద్ద కలలు కనవచ్చని, అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించవచ్చనే నమ్మకాన్ని వీరు కలిగించారు. ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లగలిగిన వీరి విజయ గాథల్లో ఎంతో వాస్తవం ఉంది. జీవితంలో అన్ని రంగాలకు ఇవి స్ఫూర్తినందిస్తాయి. ఈ ఆరుగురికి కంపెనీ సొమ్ము నుంచి కాకుండా నా సొంత డబ్బులతో కొత్త థార్‌ ఎస్‌యూవీ వాహనాలను కానుకగా అందించడం పట్ల ఎంతో ఆనందిస్తున్నా. వీరంతా తమపై తాము ఎంతో నమ్మకముంచి నలుగురు నడిచిన దారిలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకొనే సాహసం చేయడమే నేను బహుమతి ఇవ్వడానికి కారణం. వీరికి నా అభినందనలు. వీలైనంత తొందరగా తగిన ప్రాధాన్యత ఇస్తూ వారికి ‘థార్‌’లు అందజేయమని మహీంద్రా కంపెనీకి విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ ఆనంద్‌ ట్వీట్‌ చేశారు.
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు