Danushka Gunathilaka: లంక క్రికెటర్‌ గుణతిలకకు బెయిల్‌

17 Nov, 2022 15:28 IST|Sakshi

శ్రీలంక క్రికెటర్‌ దనుష్క గుణతిలకకు కాస్త ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుణతిలకకు బెయిల్‌ మంజూరు అయింది. అయితే సోషల్‌ మీడియాకు మాత్రం దూరంగా ఉండాలని కోర్టు హెచ్చరించింది. ఇక టి20 ప్రపంచకప్‌ సమయంలో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేయడం సంచలం కలిగించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుణతిలక ఉన్న హోటల్‌కు వచ్చి అరెస్టు చేశారు. అప్పటినుంచి గుణతిలక కేసులో విచారణ జరుగుతుంది.

అయితే స్థానిక కోర్టు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో గుణతిలక అక్కడి సుప్రీంను ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు విచారణ చేపట్టి గుణతిలకకు కొన్ని కండీషన్స్‌పై బెయిల్‌ మంజూరు చేసింది. కేసు పూర్తయ్యేంత వరకు దేశం విడిచి వెళ్లరాదని.. 150,000 ఆస్ట్రేలియన్‌ డాలర్ల జరిమానతో పాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది.

రెండురోజులకోసారి పోలిస్‌ రిపోర్టింగ్‌ ఇవ్వాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చింది. అంతేకాదు రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు గుణతిలకపై నిఘా ఉంటుందని.. తనపై కేసు పెట్టిన మహిళతో ఎలాంటి కాంటాక్ట్‌ పెట్టుకోకూడదని తెలిపింది. ఇక ఈ కేసు మళ్లీ జనవరి 12న విచారణకు వచ్చే అవకాశముంది.

ఇక టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 దశలో లంక పోరాటం ముగియడంతో స్వదేశానికి వెళ్లిపోయింది. అయితే గుణతిలకను మాత్రం ఆస్ట్రేలియాలోనే వదిలేసింది. లైంగిక ఆరోపణలపై గుణతిలక అరెస్టైన వెంటనే అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు లంక క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక గుణతిలక లంక తరపున 47 వన్డేలు, 46 టి20లు, ఎనిమిది టెస్టులు ఆడాడు.

చదవండి: ఆసీస్‌లో లంక క్రికెటర్‌ గుణతిలక అరెస్ట్‌

మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్‌, రక్షణ కూడా లేకుండా అమానుషంగా

మరిన్ని వార్తలు