ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందడుగు వేసిన అఫ్గనిస్తాన్‌

28 Nov, 2022 09:11 IST|Sakshi
టీమిండియా- అఫ్గనిస్తాన్‌ జట్టు(PC: BCCI, ACB Twitter)

ICC Cricket World Cup Super League- Team India Top: శ్రీలంక పర్యటనలో ఉన్న అఫ్గనిస్తాన్‌కు వరుణుడు ఉపకారం చేశాడు. వర్షం కారణంగా లంకతో రెండో వన్డే రద్దు కావడంతో అఫ్గన్‌ ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించేందుకు మార్గం మరింత సుగమమైంది. కాగా మూడు వన్డేల సిరీస్‌ కోసం హష్మతుల్లా షాహిది బృందం శ్రీలంకలో పర్యటిస్తోంది.

ఇందులో భాగంగా పల్లకెలో జరిగిన మొదటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అఫ్గన్‌ జట్టు.  అయితే, ఆదివారం నాటి రెండో వన్డేలో అఫ్గనిస్తాన్‌ 228 పరుగులు మాత్రమే స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో పర్యాటక జట్టును కట్టడి చేయగలిగిన లంకకు సిరీస్‌ను సమం చేసే అవకాశం దక్కింది.

అయితే, వరుణుడు ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్‌ ముగిసిపోయింది. అప్పటికి 2.4 ఓవర్లలో లంక స్కోరు: 10-0.

అఫ్గనిస్తాన్‌ లైన్‌ క్లియర్‌
ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఇరు జట్లకు 5 పాయింట్లు వచ్చాయి. దీంతో ఇప్పటికే 110 పాయింట్లతో ఉన్న అఫ్గనిస్తాన్‌ 115 పాయింట్లతో ఐసీసీ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో ఏడో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశానికి మరింత చేరువైంది.

లంక కష్టమే!
మరోవైపు.. లంక మాత్రం 67 పాయింట్లతో ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. ఇక శ్రీలంకకు ఈ వరల్డ్‌కప్‌ సైకిల్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లే మిగిలి ఉండటంతో ఆ జట్టు టాప్‌-8కు చేరుకునే అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. అయితే, ప్రస్తుత సిరీస్‌లో మూడో వన్డేలో గనుక అఫ్గన్‌ను ఓడిస్తే వాళ్లకు 10 పాయింట్లు లభిస్తాయి. దీంతో వెస్టిండీస్‌, ఐర్లాండ్‌లతో ఎనిమిదో స్థానం కోసం పోటీపడే అవకాశం ఉంటుంది.

టాప్‌లో టీమిండియా.. పైకి ఎగబాకిన కివీస్‌
ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్‌ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న కారణంగా మ్యాచ్‌ ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా క్వాలిఫై అయింది.


ఐసీసీ సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టిక(PC: ICC)

అయినప్పటికీ 134 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా టీమిండియా కొనసాగుతుండటం విశేషం. మరోవైపు.. భారత్‌తో రెండో వన్డే ఫలితం తేలకుండా ముగియడంతో న్యూజిలాండ్‌ 125 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం.

చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్‌..
IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు?

మరిన్ని వార్తలు