SL VS AUS 1st Test Day 2: వర్ష బీభత్సానికి అతలాకుతలమైన స్టేడియం

30 Jun, 2022 17:59 IST|Sakshi

ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయి కొట్టిమిట్టాడుతున్న  ద్వీప దేశం శ్రీలంకపై ప్రకృతి సైతం పగబట్టింది. ఇవాళ (జూన్‌ 30) ఉదయం కురిసిన భారీ వర్షం దెబ్బకు లంకలోని చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్ష బీభత్సం ధాటికి కొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. వర్ష ప్రభావం శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌పై కూడా చూపింది. 

వర్షం ధాటికి ఈ మ్యాచ్‌కు వేదిక అయిన గాలే స్టేడియం అతలాకుతలమైంది. తొలి టెస్ట్‌ రెండో రోజు ఆట ప్రారంభానికి రెండు గంటల ముందు ప్రారంభమైన గాలివాన దెబ్బకు ఓ స్టాండ్‌ రూఫ్‌ కూలిపోవడంతో పాటు స్టేడియం మొత్తం చిత్తడిచిత్తడిగా మారిపోయింది. ఫలితంగా రెండో రోజు ఆట దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈదురుగాలుల ధాటికి రూఫ్‌ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇదిలా ఉంటే, వర్షం పూర్తిగా ఆగిపోయాక లంచ్‌ తర్వాత  ఆట ప్రారంభమైంది. 98/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్ద ప్రారంభమైన రెండు రోజు ఆటలో ఆసీస్‌ ఆధిపత్యం చలాయించింది. రెండు రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసి 101 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది.  ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (71), కెమరూన్‌ గ్రీన్‌ (77)  అర్ధసెంచరీతో రాణించారు. అలెక్స్‌ క్యారీ (45) పర్వాలేదనిపించాడు. కమిన్స్‌ (26), లయన్‌ (8) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌటైంది. నాథన్‌ లయన్‌ 5 వికెట్లతో చెలరేగాడు. 
చదవండి: IND Vs ENG: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై! ప్రాక్టీసు వీడియో!

మరిన్ని వార్తలు