Dinesh Chandimal Double Century: చండిమాల్‌ డబుల్‌ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్‌ బ్యాటర్లకు చుక్కలు!

11 Jul, 2022 17:00 IST|Sakshi
దినేశ్‌ చండిమాల్‌(PC: Sonyliv)

చండిమాల్‌ అజేయ ద్విశతకం

చెలరేగిన ప్రభాత్‌ జయసూర్య

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్‌ దినేశ్‌ చండిమాల్‌ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో తొలిసారిగా ద్విశతకం నమోదు చేశాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా చండిమాల్‌ 206 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

మొత్తంగా 326 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా టెస్టుల్లో చండిమాల్‌కు ఇది మొదటి ద్విశతకం. సిక్సర్‌తో ఈ ఫీట్‌ నమోదు చేయడం గమనార్హం. అదే విధంగా ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు నమోదు చేసిన శ్రీలంక ఆటగాడిగా అతడు నిలిచాడు.

ఇక చండిమాల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ నేపథ్యంలో ఆతిథ్య శ్రీలంక 554 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ నేపథ్యంలో చండిమాల్‌పై సోషల్‌ మీడియా ప్రశంసల జల్లు కురుస్తోంది. 

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘నిన్న రాత్రి సూర్యకుమార్‌ యాదవ్‌.. ఈరోజు చండిమాల్‌.. వేర్వేరు ఫార్మాట్లు.. వేర్వేరు శైలి.. కానీ ఎంతో ఆసక్తిగా మ్యాచ్‌ను తిలకించేలా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు’’ అంటూ ఇండియా- ఇంగ్లండ్‌ మూడో టీ20, ఆసీస్‌-లంక టెస్టు మ్యాచ్‌ను ఉద్దేశించి కామెంట్‌ చేశాడు. ఇతర ఆటగాళ్లు, నెటిజన్లు సైతం చండిమాల్‌ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

కాగా మూడు టీ20లు, 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. టీ20 సిరీస్‌ పర్యాటక ఆసీస్‌ సొంతం కాగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య లంక కైవసం చేసుకుంది. ఇక మొదటి టెస్టులో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో లంక గట్టిపోటీనిస్తోంది. 

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా నాలుగో రోజు ఆటలో లంక బౌలర్‌ ప్రభాత్‌ జయసూర్య బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్‌ 151 పరుగులకే ఆలౌట్‌ అయింది.

శ్రీలంక వర్సెస్‌ ఆస్ట్రేలియా రెండో టెస్టు:
టాస్‌: ఆస్ట్రేలియా- బ్యాటింగ్‌
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 364-10 (110 ఓవర్లు)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 554-10 (181 ఓవర్లు)
ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌: ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 151-10 (41 ఓవర్లు)

చదవండి: Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో!
Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్‌ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్‌ దేవ్‌...

మరిన్ని వార్తలు