SL VS AUS 4th ODI: శతక్కొట్టిన అసలంక.. అయినా తక్కువ స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక

21 Jun, 2022 20:47 IST|Sakshi

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన 3 వన్డేల్లో వరుసగా రెండు వన్డేల్లో గెలుపొంది ఆధిక్యంలో కొనసాగుతున్న (2-1) ఆ జట్టు తాజాగా జరుగుతున్న నాలుగో వన్డేలోనూ మెరుగైన ప్రదర్శన చేసి మరో విజయం దిశగా అడుగులు వేస్తుంది. కొలొంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. చరిత్‌ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, సిక్స్‌) సూపర్‌ శతకంతో రాణించినప్పటికీ 258 పరుగులకే పరిమితమైంది. 

అసలంకకు ధనంజయ డిసిల్వ (60) మినహా ఎవరూ సహకరించకపోవడంతో ఆ జట్టు తక్కువ స్కోర్‌కే ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో కున్హేమన్, కమిన్స్, మిచెల్‌ మార్ష్ తలో 2 వికెట్లు, మ్యాక్స్‌వెల్‌ ఓ వికెట్‌ పడగొట్టగా ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు రనౌటయ్యారు. అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 25 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (70) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో గనుక శ్రీలంక విజయం సాధిస్తే మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ చేజిక్కించుకుని సంచలనం సృష్టిస్తుంది. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది.
చదవండి: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్‌ క్రికెటర్‌
 

మరిన్ని వార్తలు