SL VS PAK 1st Test: జయసూర్య మాయాజాలం.. టెస్ట్‌ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌

17 Jul, 2022 13:15 IST|Sakshi

టెస్ట్‌ క్రికెట్‌లో శ్రీలంక సంచలన స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించడం ద్వారా అతను టెస్ట్‌ క్రికెట్‌లో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పాక్‌పై తొలి ఇన్నింగ్స్‌లో (రెండో రోజు లంచ్‌ సమయానికి 5/41) ఇదేసిన జయసూర్య.. అంతకుముందు ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆరేసి వికెట్లు (6/118, 6/59) పడగొట్టాడు.  ప్రస్తుతానికి జయసూర్య ఖాతాలో 3 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 17 వికెట్లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, గాలే వేదికగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టు సాధించింది. తొలి రోజు ఆటలో పాక్‌ బౌలర్ల ధాటికి 222 పరుగులకే కుప్పకూలిన లంకేయులు.. రెండో రోజు బౌలింగ్‌లో చెలరేగిపోయారు. 24/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన పాక్‌ను.. జయసూర్య, కసున్‌ రజిత (1/21), రమేశ్‌ మెండిస్‌ (1/11) దారుణంగా దెబ్బతీశారు. వీరి ధాటికి పాక్‌ లంచ్‌ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులు మాత్రమే చేసింది. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ (34)కు జతగా యాసిర్‌ షా (12) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు పాక్‌ ఇటీవలే లంకలో అడుగుపెట్టింది. జులై 24 నుంచి రెండో టెస్ట్‌ ప్రారంభమవుతుంది. 


చదవండి: మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

మరిన్ని వార్తలు