SL VS PAK 2nd Test Day 1: తేలిపోయిన పాక్‌ బౌలర్లు.. సత్తా చాటిన లంక బ్యాటర్లు

24 Jul, 2022 18:09 IST|Sakshi

గాలే వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 24) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో లంక బ్యాటర్లు సత్తా చాటారు. కుశాల్‌ మెండిస్‌ (3) మినహా టాపార్డర్‌ మొత్తం రాణించడంతో తొలి రోజు శీలంకదే పైచేయిగా నిలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్ల ప్రభావం నామమాత్రంగా ఉండటంతో లంక బ్యాటర్లు సత్తా చాటారు.

ఓపెనర్లు ఒషాడో ఫెర్నాండో (50), దిముత్‌ కరుణరత్నే (40) తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించగా.. ఆ తర్వాత వచ్చిన శతక టెస్ట్‌ల వీరుడు ఏంజెలో మాథ్యూస్‌ (42), ధనంజయ డిసిల్వా (33) ఓ మోస్తరుగా రాణించారు. గత కొంతకాలంగా సూపర్‌ ఫామ్‌లో ఉన్న దినేశ్‌ చండీమల్‌ (80) వరుసగా నాలుగో ఇన్నింగ్స్‌లోనూ (206*, 76, 94*, 80) హాఫ్‌ సెంచరీ బాది కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఆట చివరి సెషన్‌లో వికెట్‌కీపర్‌ నిరోషన్‌ డిక్వెల్లా (42 నాటౌట్‌) మెరుపు వేగంతో పరుగులు సాధించి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. డిక్వెల్లాకు జతగా దునిత్‌ వెల్లాలగే (6) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ నవాజ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. నసీమ్‌ షా, నౌమాన్‌ అలీ, యాసిర్‌ షా తలో వికెట్‌ సాధించారు. కుశాల్‌ మెండిస్‌ను అఘా సల్మాన్‌ రనౌట్‌ చేశాడు. 
చదవండి: టెస్ట్‌ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్‌
 

మరిన్ని వార్తలు