SL VS PAK 2nd Test: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు

28 Jul, 2022 15:36 IST|Sakshi

స్పిన్నర్లు ప్రభాత్‌ జయసూర్య (3/80, 5/117), రమేశ్‌ మెండిస్‌ (5/47, 4/101)లు రెచ్చిపోవడంతో పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక ఘన విజయం సాధించింది. 508 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. లంక స్పిన్నర్ల ధాటికి 261 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 246 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 89/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్‌.. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆట మొదలైన కొద్దిసేపటికే ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (49) వెనుదిరగగా.. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (81) , వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (37)లు కాసేపు ప్రతిఘటించారు. 

ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఫవాద్‌ ఆలం (1), అఘా సల్మాన్‌ (4), మహ్మద్‌ నవాజ్‌ (12), యాసిర్‌ షా (27), హసన్‌ అలీ (11), నసీమ్‌ షా (18)లు లంక స్పిన్నర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్క ఫవాద్‌ ఆలం (రనౌట్‌) వికెట్‌ మినహా మిగిలిన వికెట్లన్నిటినీ లంక స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకే ఆలౌట్‌ కాగా.. పాక్‌ 231 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం శ్రీలంక 360/8 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయగా.. భారీ ఛేదనలో పాక్‌ చేతులెత్తేసింది.    

ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ధనంజయ డిసిల్వాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా.. సిరీస్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 17 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్‌ జయసూర్యకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు లభించింది. కాగా, తొలి టెస్ట్‌లో లంక నిర్ధేశించిన 342 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్‌ సునాయాసంగా ఛేదించి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. 

స్కోర్‌ వివరాలు..
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 378 ఆలౌట్‌ (చండీమల్‌ (80), నసీమ్‌ షా (3/58))

పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 231 ఆలౌట్‌ (అఘా సల్మాన్‌ (62), రమేశ్‌ మెండిస్‌ (5/47))

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: 360/8 డిక్లేర్‌ (ధనంజయ డిసిల్వా (109), నసీమ్‌ షా (2/44))

పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌: 231 (బాబర్‌ ఆజమ్‌ (81), ప్రభాత్‌ జయసూర్య (5/117))
చదవండి: డిసిల్వా అద్భుత శతకం.. పాక్‌ ఓటమి ఖాయం..!

మరిన్ని వార్తలు