ముందుగానే ఊహించి గాల్లో తేలుతూ ఒడిసిపట్టాడు.. 

1 Mar, 2021 17:28 IST|Sakshi

కేప్‌టౌన్‌: క్రికెట్‌లో స్లిప్‌ ఫీల్డింగ్‌ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా క్యాచ్‌ చేజారడమే కాకుండా బంతి శరీరంపైకి దూసుకొచ్చి గాయాలబారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్థానంలో ఫీల్డింగ్‌ అంటే ఫీల్డర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. దక్షిణాప్రికా దేశవాళి క్రికెట్‌లో భాగంగా జరిగిన ఓ 50 ఓవర్‌ మ్యాచ్‌లో ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మార్టిన్‌ వాన్‌ జార్స్‌వెల్డ్‌ అనే ఆటగాడు చాలా అప్రమత్తంగా వ్యవహరించి, బ్యాట్స్‌మెన్‌ బంతిని ఆడే దిశను ముందుగానే పసిగట్టి, ఫస్ట్‌ స్లిప్‌ నుంచి లెగ్‌ సైడ్‌కు డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. 

బ్యాట్స్‌మెన్‌ స్కూప్‌ షాట్‌కు ప్రయత్నిస్తున్నాడని పసిగట్టి, వికెట్‌కీపర్‌ వెనుక నుంచి అద్భుతంగా డైవ్‌ చేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టుకొని ఫీల్డ్‌లో ఉన్నవారందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఆ క్రికెటర్‌ చేసిన అద్భుత విన్యాసం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఫీల్డర్‌ చూపిన సమయస్పూర్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ క్యాచ్‌ను ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్లిప్‌ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ఫీట్‌ను సాధించిన జార్స్‌వెల్డ్‌ దక్షిణాఫ్రికా తరపున 9టెస్టులు, 11 వన్డేలు ఆడాడు. కాగా, దక్షిణాఫ్రికా జట్టు జాంటీ రోడ్స్‌ లాంటి అల్‌టైమ్‌ గ్రేట్‌ ఫీల్డర్లను అందించడమే కాకుండా, గ్యారీ కిర్స్‌టన్‌, గ్రేమ్‌ స్మిత్‌ లాంటి అద్భుతమైన స్లిప్‌ ఫీల్డర్లను కూడా అందించింది. 

మరిన్ని వార్తలు