HP Vs PUN: పంజాబ్‌ను మట్టికరిపించి.. ఫైనల్లో తొలిసారిగా.. మరో ట్రోఫీకి అడుగు దూరంలో ధావన్‌ సేన

3 Nov, 2022 16:29 IST|Sakshi

Syed Mushtaq Ali Trophy 2022- Punjab vs Himachal Pradesh, Semi Final 1: సయ్యద్‌​ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2022 సెమీ ఫైనల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సమిష్టి కృషితో తొలిసారిగా దేశవాళీ​ టీ20 టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్‌కతాలో పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది.

సెమీ ఫైనల్‌-1
ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2022 తొలి సెమీ ఫైనల్లో హిమాచల్‌ ప్రదేశ్‌- పంజాబ్‌ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రిషి ధావన్‌ సేనకు ఆదిలోనే షాకిచ్చారు పంజాబ్‌ బౌలర్లు.

ఆదుకున్న సుమీత్‌ వర్మ, ఆకాశ్‌
ఓపెనర్లు ప్రశాంత్‌ చోప్రా, అంకుశ్‌ బైన్స్‌ వరుసగా 17, 16 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన అభిమన్యు రాణా(2 రన్స్‌) పూర్తిగా నిరాశపరిచాడు. జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుమీత్‌ వర్మ పట్టుదలగా నిలబడ్డాడు.

25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో ఆకాశ్‌ వశిష్ట్‌ 43 పరుగులతో సహకారం అందించాడు. వీరిద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. పంకజ్‌ జైస్వాల్‌ సైతం 27 పరుగులతో రాణించాడు. శుభారంభం లభించకపోయినా మిడిలార్డర్‌ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో​ హిమాచల్‌ ప్రదేశ్‌ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది.

రిషి మూడు వికెట్లు పడగొట్టి
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లలో శుబ్‌మన్‌ గిల్‌ 45 పరుగులతో ఆకట్టుకోగా.. అభిషేక్‌ శర్మ మాత్రం ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు. మిగిలిన వాళ్లలో అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ 30, కెప్టెన్‌ మన్‌దీప్‌ సింగ్‌ 29(నాటౌట్‌), రమణ్‌దీప్‌ సింగ్‌ 29 పరుగులు చేశారు. అయితే, అప్పటికే మ్యాచ్‌ పంజాబ్‌ చేజారిపోయింది. డెత్‌ ఓవర్లలో హిమాచల్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మరో టైటిల్‌ దిశగా
హిమాచల్‌ బౌలర్లలో కెప్టెన్‌ రిషి ధావన్‌కు మూడు, కున్వార్‌ అభినయ్‌ సింగ్‌కు ఒకటి, మయాంక్‌ దాగర్‌కు రెండు, ఆకాశ్‌ వశిష్ట్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ఇక ఈ విజయంతో హిమాచల్‌ ప్రదేశ్‌ తొలిసారిగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో సెమీ ఫైనల్లో విజేత(విదర్భ వర్సెస్‌ ముంబై)తో తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనుంది.

పరిమిత ఓవర్లలో మరో దేశవాళీ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా గతేడాది.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీని హిమాచల్‌ ప్రదేశ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పటిష్ట జట్టు అయిన తమిళనాడును ఓడించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.

చదవండి: T20 WC Ind Vs Ban: అప్పుడు కూడా నరాలు తెగే ఉత్కంఠ! బంగ్లా ఒక్క పరుగుతో.. టాయ్‌లెట్‌కి వెళ్లి
Ind Vs Ban: కోహ్లి ఫేక్‌ ఫీల్డింగ్‌ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్‌

మరిన్ని వార్తలు