Womens Asia Cup: అరుదైన క్లబ్‌లో చేరిన టీమిండియా క్రికెటర్‌

10 Oct, 2022 19:55 IST|Sakshi

Smriti Mandhana: టీమిండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధన ఓ అరుదైన క్లబ్‌లో చేరింది. ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భాగంగా థాయ్‌లాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 10) జరిగిన మ్యాచ్‌లో ఆడటం ద్వారా మంధన 100 అంతర్జాతీయ టీ20లు పూర్తి చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా, నాలుగో టీమిండియా క్రికెటర్‌గా (పురుషులతో కలిపి), ఓవరాల్‌గా 37వ అంతర్జాతీయ క్రికెటర్‌గా (పురుషులు, మహిళలతో కలిపి) రికార్డుల్లోకెక్కింది. 

భారత మహిళల క్రికెట్‌లో మంధనకు ముందు ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఒక్కరే 100 మ్యాచ్‌ల ఫీట్‌ సాధించారు. హర్మన్‌ 135 మ్యాచ్‌ల్లో సెంచరీ, 8 హాఫ్‌ సెంచరీల సాయంతో 2647 పరుగులు సాధించగా.. మంధన 100 మ్యాచ్‌ల్లో 17 అర్ధసెంచరీల సాయంతో 2373 పరుగులు స్కోర్‌ చేసింది. పురుషుల క్రికెట్‌ కూడా కలుపుకుంటే భారత్‌ తరఫున ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ సారధి విరాట్‌ కోహ్లి మాత్రమే 100 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నారు.

హిట్‌మ్యాన్‌ ఇప్పటివరకు అత్యధికంగా (పురుషులు, మహిళa క్రికెట్‌లో ఇదే అత్యధికం) 142 టీ20లు ఆడగా.. విరాట్‌ 109 మ్యాచ్‌లు ఆడాడు. ఇక మహిళల క్రికెట్‌లో అత్యధిక టీ20లు ఆడిన రికార్డు న్యూజిలాండ్ బ్యాటర్‌ సుజీ బేట్స్ పేరిట ఉంది. ఆమె మొత్తం 136 మ్యాచ్‌లు ఆడింది.

ఇక ఇవాళ థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి ధాటికి ప్రత్యర్ధి చిగురుటాకులా వణికిపోయింది. 15.1 ఓవర్లు ఆడిన థాయ్‌ జట్టు కేవలం 37 పరుగులకే కుప్పకూలింది. ఆతర్వాత భారత్‌ కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
 

మరిన్ని వార్తలు