Smriti Mandhana T20I Runs: టీ20ల్లో అరుదైన మైలురాయిని అధిగమించిన టీమిండియా బ్యాటర్‌

25 Jun, 2022 21:50 IST|Sakshi

INDW VS SLW: టీమిండియా బ్యాటర్‌ స్మృతి మంధాన పొట్టి క్రికెట్‌లో ఓ అరుదైన మైలురాయిని అధిగమించింది. శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మంధాన రేర్‌ ఫీట్‌ను సాధించింది. శనివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 39 పరుగులు చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్‌లో 2000 పరుగుల (84 ఇన్నింగ్స్‌ల్లో) మార్కును అధిగమించిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది.

మంధాన కంటే ముందు రోహిత్‌ శర్మ (125 ఇన్నింగ్స్‌ల్లో 3313 పరుగులు), విరాట్‌ కోహ్లి (97 ఇన్నింగ్స్‌ల్లో 3297), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (84 ఇన్నింగ్స్‌ల్లో 2372), మిథాలీ రాజ్‌ (70 ఇన్నింగ్స్‌ల్లో 2364) టీ20ల్లో 2000 మార్కును అందుకున్నారు. ఈ రికార్డుతో పాటు మంధాన మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో వేగంగా 2000 పరుగులు చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.

ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా ఓ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన హర్మన్‌.. మిథాలీ రాజ్‌ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును (భారత మహిళల క్రికెట్‌లో) అధిగమించింది. 

ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్‌ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
చదవండి: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. సిరీస్‌ కైవసం
 

మరిన్ని వార్తలు