Women’s World Cup 2022: క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును!

12 Mar, 2022 16:54 IST|Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో  155 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీలు సాధించి కీలక పాత్ర పోషించారు. మంధాన 119 బంతుల్లో 123 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ 107 బంతుల్లో 109పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో 119 పరగులు చేసిన స్మృతి మంధాన ఎంపికైంది. అయితే ఇక్కడే మంధాన తన ‍క్రీడా స్పూర్తిను చాటుకుంది. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పంచుకుంది.

పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌లో  మంధాన మాట్లాడుతూ.. "నేను సెంచరీ సాధించాను, కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక అవ్వాలని ఒక క్రికెటర్‌గా నేను ఎప్పుడూ కోరుకోను. మా జట్టు 300 పరుగుల భారీ స్కోర్‌ సాధించడంలో మేమిద్దరం సమానంగా సహకరించామని నేను భావిస్తున్నాను. కాబట్టి, ట్రోఫీని హర్మన్‌తో పంచుకోవాలి అనుకున్నాను. అదే విధంగా అవార్డు పొందడానికి మేమిద్దరం అర్హులమని నేను అనుకుంటున్నాను. మేము న్యూజిలాండ్‌, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మా తప్పులను మేము గ్రహించాం.

ఇకపై వాటిని మేము  పునరావృతం చేయబోమని భావిస్తున్నాను" అని మంధాన పేర్కొంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  317 పరుగల భారీ స్కోర్‌ సాధించింది. ఇక 318 పరుగుల లక్ష్యంతో బరిలో​కి దిగిన వెస్టిండీస్‌ 162 పరుగులకే కుప్ప కూలింది. భారత బౌలర్లలో  స్నేహ్‌ రాణా మూడు వికెట్లు పడగొట్టగా.. ఝులన్‌ గోస్వామి ఒకటి, మేఘన సింగ్‌ 2, రాజేశ్వరీ గైక్వాడ్‌ ఒకటి, పూజా వస్త్రాకర్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

చదవండి: Ind Vs Sl 2nd Test: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్‌ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత!

మరిన్ని వార్తలు