సోషల్‌ మీడియా ప్రభావం.. మాట మార్చిన పైన్‌

14 May, 2021 17:46 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా మమ్మల్ని చీట్‌ చేసి సిరీస్‌ గెలిచిందంటూ ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. పైన్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపాయి. పైన్‌ తీరును విమర్శిస్తూ నెటిజన్లు ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు. సోషల్‌ మీడియా ప్రభావంతో పైన్‌ దెబ్బకు మాట మార్చేశాడు.

''సిరీస్‌ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. వాటికి మాత్రమే నేను సమాధానం చెప్పా. టీమిండియా జట్టు బ్రిస్బేన్‌ వెళ్లరంటూ మాకు వార్తలు వచ్చాయి. మమ్మల్ని పక్కదారి పట్టించేందుకే టీమిండియా అలా చెప్పిందేమో అనుకున్నా. దీనికి తోడు మూడో టెస్టులో మ్యాచ్‌ మధ్యలో టీమిండియా బ్యాట్స్‌మన్‌ ప్రతీసారి గ్లౌజ్‌లు తీస్తూ.. ఫిజియోను రప్పించి ఏవోవో మాట్లాడుకున్నారు. ఇదంతా మా ఏకాగ్రతను దెబ్బతీసేందుకేమోనని భావించా. అందుకే సైడ్‌ షోస్‌ అనే పదం వాడాల్సి వచ్చింది. అంతేగానీ టీమిండియా చీటింగ్‌ చేసి సిరీస్‌ గెలిచిందనలేదు.

మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత పట్టు బిగించాల్సింది. కానీ టీమిండియా అద్బుత ప్రతిభతో సిరీస్‌ను ఎగురేసుకుపోయింది. నేను చేసిన వ్యాఖ్యలను భారత అభిమానులు తప్పుగా భావించి ట్రోల్‌ చేశారు. కానీ ఇలాంటివి నేను పట్టించుకోను.. ఎందుకంటే భారత అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం. వారు ఏం చేసినా నేను సరదాగానే తీసుకుంటాను. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న  గౌరవం ఏంటో తెలిసొచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయంతో టీమిండియా సిరీస్‌ను ఆరంభించింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటీ లీవ్స్‌పై స్వదేశానికి తిరిగి వచ్చేయడం.. పలువురు సీనియర్‌ ఆటగాళ్లు గాయపడడంతో టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవడం కష్టమేనని అంతా భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ రహానే సారధ్యంలో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘన విజాయన్ని సాధించింది. ఆ తర్వాత మూడో టెస్టు డ్రా చేసకున్నా.. గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకోవడమేగాక బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీని కూడా చేజెక్కించుకుంది. ఈ సిరీస్‌ మొత్తంగా చూసుకుంటే రిషబ్‌ పంత్‌, సుందర్‌, శుబ్‌మన్‌ గిల్‌, సిరాజ్‌లు అద్భుతంగా రాణించి సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర వహించారు.
చదవండి: టీమిండియా చీటింగ్‌ చేసి సిరీస్‌ గెలిచింది: పైన్‌

మరిన్ని వార్తలు