బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో మరికొందరి ప్రమేయం..

17 May, 2021 21:50 IST|Sakshi

మెల్‌బోర్న్‌: మూడేళ్ల కిందట జరిగిన బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. ఆ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాన్‌క్రాఫ్ట్‌ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్‌, డేవిడ్‌ వార్నర్‌ మేనేజర్‌ జేమ్స్‌, ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌లు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రక్తి కట్టించాయి. ఈ విషయమై తొలుత బాన్‌క్రాఫ్ట్‌ మాట్లాడుతూ.. 2018లో సఫారీలతో జరిగిన మూడో టెస్ట్‌లో తాను సాండ్‌ పేపర్‌ వాడిన విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాంబు పేల్చగా, తాజాగా ఆసీస్‌ లెజండరీ ఆటగాడు గిల్లీ మాట్లాడుతూ.. బాల్‌ టాంపరింగ్‌ జరిగిన విషయం బాన్‌క్రాఫ్ట్‌తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  

క్రికెట్‌ ఆస్ట్రేలియాను ఓ కుదుపునకు లోను చేసిన ఈ ఉదంతంపై వార్నర్‌ మేనేజర్‌ జేమ్స్‌ మాట్లాడుతూ.. నాడు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు.  మరోవైపు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ క్లార్క్‌ స్పందిస్తూ.. బాల్‌ టాంపరింగ్‌ జరిగిన విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు.  కాగా, ఈ వివాదంలో బాన్‌క్రాఫ్ట్‌తోపాటు నాటి జట్టు కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. 
చదవండి: భారత క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు