WTC FInal: భారత్‌కు ‘సన్నద్ధతలేమి’ సమస్య కాదు

13 May, 2021 02:34 IST|Sakshi

భారత ఆటగాళ్లకు తగినంత అనుభవం ఉంది

డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జూన్‌ 18 నుంచి జరిగే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు సరైన రీతిలో సన్నద్ధమయ్యేందుకు భారత జట్టుకు తగినంత సమయం లభించడం లేదు. ఇంగ్లండ్‌ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత ఉండే క్వారంటైన్‌ నిబంధనలు, ఆంక్షలే అందుకు కారణం. అయితే ఇది మరీ పెద్ద సమస్య ఏమీ కాదని జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అభిప్రాయపడ్డాడు. మన ఆటగాళ్లకు ఉన్న అనుభవంతో దానిని అధిగమించవచ్చని అతను చెప్పాడు.

‘ఇంగ్లండ్‌ వెళ్లిన తర్వాత హార్డ్‌ క్వారంటైన్‌ ఎన్ని రోజులు? సాఫ్ట్‌ క్వారంటైన్‌ ఎన్ని రోజులు? ఇలా అన్ని అంశాలు చూసిన తర్వాతే సన్నద్ధతపై స్పష్టత రావచ్చు. అయితే మాకు ఎంత సమయం దొరికినా దానిని పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎన్ని సెషన్లు ప్రాక్టీస్‌కు అవకాశం లభిస్తుందో చెప్పలేం. ఇంతకుమించి మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. అయితే మన జట్టులో ఆటగాళ్లంతా అనుభవజ్ఞులే. ఇలాంటి స్థితిలో అదే అవసరం. వారంతా పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకోగలరు. వారంతా న్యూజిలాండ్‌లోనూ ఇంగ్లండ్‌లోనూ కూడా ఆడారు’ అని శ్రీధర్‌ విశ్లేషించాడు. అయితే ఎక్కువగా సన్నద్ధం కాకపోవడం కూడా కొన్నిసార్లు మేలు చేస్తుందని శ్రీధర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇది ఉపకరిస్తుందని అతను చెప్పాడు.   

వారికి కొంత అనుకూలత: భరత్‌ అరుణ్‌
భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుండటం న్యూజిలాండ్‌కు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదని టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ అన్నాడు. అయితే తాము దేనికైనా సిద్ధంగా ఉండాలని అతను చెప్పాడు. ‘ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అలవాటు పడతారు కాబట్టి కచ్చితంగా వారికి కొంత అనుకూలత ఉంటుంది. షెడ్యూల్‌ అలా ఉంది కాబట్టి మనమేమీ చేయలేం. దాని ప్రకారమే ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఎలా ఆడుతుందో చూడటం ఎంతో అవసరం. దానిని బట్టే మన వ్యూహాలు తయారు చేసుకోవాల్సి ఉంది’ అని అరుణ్‌ వ్యాఖ్యానించాడు.

చదవండి: WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్‌దే గెలుపు!

మరిన్ని వార్తలు