Tokyo Olympics: డబ్ల్యూఎఫ్‌ఐ కన్నెర్ర.. మహిళా రెజ్లర్‌ సోనంకు నోటీసు

11 Aug, 2021 11:08 IST|Sakshi

న్యూఢిల్లీ: తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మరో మహిళా రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ టోక్యో బయల్దేరడానికి ముందు పాస్‌పోర్ట్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయంలో తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఆమె మాత్రం తన పాస్‌పోర్ట్‌ను తీసుకొని రావాలని ఏకంగా భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) అధికారులను ఆజ్ఞాపించింది. రెజ్లర్ల క్రమశిక్షణా రాహిత్యం ఆ నోటా ఈ నోటా భారత ఒలింపిక్‌ సంఘానికి (ఐఓఏ) తెలిసింది. రెజ్లర్లు ప్రవర్తన నియమావళిని అతిక్రమించడం ఏమాత్రం రుచించని ఐఓఏ... ‘మీ క్రీడాకారుల్ని మీరు నియంత్రించలేరా’ అని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాను తలంటింది.

ఈ క్రమంలో సోనమ్‌ మాలిక్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ‘కెరీర్‌ మొదట్లోనే వీళ్లు తమను తాము స్టార్లుగా ఊహించుకుంటున్నారు. అందుకే విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇదే మాత్రం క్షమించరానిది’ అని డబ్ల్యూఎఫ్‌ఐ అధికారి ఈ సందర్భంగా చెప్పారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌లో జాతీయ కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) స్టార్‌ క్రీడాకారిణి మనిక బత్రాపై భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

చదవండి: Neeraj Chopra: గర్ల్‌ఫ్రెండ్‌ విషయంపై నీరజ్‌ చోప్రా క్లారిటీ

మరిన్ని వార్తలు