Ranji Trophy 2022: పుజారా, రహానేలకు గంగూలీ పరోక్ష హెచ్చరిక

3 Feb, 2022 16:00 IST|Sakshi

టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు చతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానేలు ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీనియర్లకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పరోక్షంగా హెచ్చరిక జారీ చేయడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్‌ వేదికల ఖరారుతో పాటు.. రంజీ ట్రోఫీ నిర్వహణపై.. బీసీసీఐ బోర్డు సభ్యులు,పలువురు అధికారులతో గంగూలీ గురువారం సమావేశం నిర్వహించాడు.

చదవండి: కోహ్లి వందో టెస్ట్‌ కోసం భారీ ఏర్పాట్లు.. కన‍్ఫర్మ్‌ చేసిన బీసీసీఐ బాస్‌

గంగూలీ మాట్లాడుతూ..'' పుజారా, రహానేలు ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. రంజీ ట్రోఫీ వారిద్దరికి మంచి అవకాశం. పరుగులు రాబట్టేందుకు ఈ సీజన్‌ వారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాగే ఉంటే జట్టు సమతుల్యం దెబ్బతింటుంది. ఇది కేవలం నా అడ్వైజ్‌ మాత్రమే.. ఎందుకంటే వారిద్దరు టీమిండియాకు ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడారు. గడ్డుకాలం ప్రతీ ఒక్కరికి వస్తుంది. రహానే, పుజారాలకు ఒకరకంగా బ్యాడ్‌టైం అనుకోవచ్చు. 2005లో నేను ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నా. అప్పుడు రంజీలో ఆడి పరుగులు సాధించడంతో పాటు సూపర్‌ ఫామ్‌తో కమ్‌బ్యాక్‌ ఇచ్చా.  అందుకే రంజీ ట్రోఫీకి వెళ్లి పరుగులు రాబట్టడంతో పాటు ఫామ్‌ను కూడా అందుకోవచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రెండు సంవత్సరాల తర్వాత భారత్‌ క్రికెట్‌లో రంజీ ట్రోఫీ సీజన్‌ ఆరంభం కానుంది. అయితే ఈసారి సీజన్‌ రెండు దశల్లో జరగనుంది. ఈ నెల చివరి వారంలో  రంజీ సీజన్‌ తొలి దశ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత నాకౌట్‌ దశను నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్‌ చేసింది.  కరోనా దృష్యా ఐపీఎల్‌, రంజీ ట్రోఫీ ఇలా రెండు పెద్ద టోర్నీలను నిర్వహించడం బీసీసీఐకి కఠిన పరీక్ష అని చెప్పొచ్చు.

చదవండి: ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ అక్కడే.. లీగ్‌ మ్యాచ్‌లేమో: గంగూలీ

మరిన్ని వార్తలు