ఈ సారి వన్డే ప్రపంచకప్‌ టీమిండియాదే: గంగూలీ

29 Jan, 2023 17:17 IST|Sakshi

స్వదేశంలో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను భారత్‌ కచ్చితంగా గెలుచుకుంటందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. భారత జట్టుకు అన్ని విభాగాల్లో సమంగా ఉంది అని, ప్రపంచకప్‌లో కూడా అదరగొడుతుందని గంగూలీ జోస్యం​ చెప్పాడు.

కాగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా టీమిండియా సొంతం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌ను గెలిచి 10 ఏళ్ల నిరీక్షణకు తెరిదించాలని టీమిండియా భావిస్తోంది.

"ప్రపం‍చ క్రికెట్‌లో భారత జట్టు ఎప్పటికీ బలమైన జట్టుగానే ఉంటుంది.  భారత్ వద్ద ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి ఎప్పటికీ టీమిండియా బలహీనమైన జట్టుగా మారదు. ప్రస్తుతం చాలా మంది ఆటగాళ్లకు ఆడే అవకాశం కూడా రావడం లేదు.  రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, సెలక్టర్లకు నేను ఒక సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను.

ప్రపంచకప్ వరకు ఇదే జట్టును కొనసాగించండి. ముఖ్యంగా ప్రపం‍చకప్‌ లాంటి మార్క్యూ ఈవెంట్‌లో  ధైర్యంగా ఆడాలి. ట్రోఫీని గెలిచినా, గెలవకపోయినా ఫియర్‌ లెస్‌ క్రికెట్‌ ఆడాలి. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా వంటి స్టార్‌ ఆటగాళ్లు ప్రస్తుతం భారత జట్టులో ఉన్నారు. బుమ్రా, జడేజా కూడా తిరిగి జట్టులో చేరనున్నారు. కాబట్టి భారత జట్టుకు తిరుగుండదు" అని స్పోర్ట్స్‌ టాక్‌తో గంగూలీ పేర్కొన్నాడు. కాగా వన్డే, టీ20ల్లో టీమిండియా నెం1 స్థానంలో​ కొనసాగుతోంది.
చదవండి: Danish Kaneria: హార్ధిక్‌కు అంత సీన్‌ లేదు.. కెప్టెన్‌గా అతను ఫెయిల్‌..!

మరిన్ని వార్తలు