అభిమానుల ఆగ్రహం.. పోస్టు డిలీట్‌ చేసిన గంగూలీ

8 Jun, 2021 09:30 IST|Sakshi

దుబాయ్‌: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 14వ సీజన్‌ , టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై వారం రోజులుగా అక్కడి అధికారులతో వరుస మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. తాజాగా గంగూలీ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే పోస్టును డిలీట్‌ చేయాల్సి వచ్చింది.

విషయంలోకి వెళితే.. వరుస మీటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతున్న గంగూలీ శనివారం(జూన్‌ 5న)దుబాయ్‌ ఆటోడ్రోమ్‌ను సందర్శించాడు. ఈ నేపథ్యంలో అక్కడ కార్‌ రేసింగ్‌లో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్నాడు.  " రేస్ కారు నడిపాను..ఇందులోంచి విపరీతమైన హీట్ వస్తోంది" అంటూ కామెంట్‌ జత చేశాడు. గంగూలీ తన పోస్టుకు అభిమానుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందని భావించాడు. కానీ అభిమానులు గంగూలీని తప్పుబడుతూ.. '' కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి పోస్టులు అవసరమా.. దీనివల్ల ఎవరికి ఉపయోగం.. సమాజం కోసం ఏదైనా మంచి పని చేయండి.. అప్పడు అభినందిస్తాం.. కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో ఇలాంటి పనులు చేయడం ఏంటి.. మొన్ననే కదా మీకు గుండెకు సంబంధించి సర్జరీ జరిగింది.. మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తారా'' అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో గంగూలీ తన పోస్టును వెంటనే డిలీట్‌ చేశాడు.


తన పోస్టుతో అభిమానుల ఆగ్రహానికి గురైన దాదా.. యూఏఈలో ఐపీఎల్‌ 14వ సీజన్‌ మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించడంలో మాత్రం సక్సెస్‌ అయ్యాడు. ఎట్టకేలకు అక్కడి అధికారులను ఒప్పించి సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు ఐపీఎల్‌ 14వ సీజన్‌ను పూర్తి చేసేలా ప్లాన్‌ చేశాడు. అయితే అక్టోబర్‌- నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ యూఏఈలో జరిగితే.. అక్టోబర్‌ 1 నాటికి మ్యాచ్‌లను నిర్వహించే మైదానాలను ఐసీసీకి అప్పగించాల్సి ఉంది. కానీ అదే సమయంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఇంకా పూర్తి కానందున టీ20 ప్రపంచకప్‌ను లంకలో షెడ్యూల్‌ చేసేలా బీసీసీఐ కసరత్తులు చేస్తోంది.మరోవైపు ప్రపంచక‌ప్ ఎక్కడ జరిగినా, హోస్టింగ్ రైట్స్ మాత్రం బీసీసీఐ వ‌ద్దే ఉంటాయ‌ని ఐసీసీ మరోసారి స్పష్టం చేసింది.
చదవండి: సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ పునఃప్రారంభం

ఆసీస్‌ వికెట్‌ కీపర్‌కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు

>
మరిన్ని వార్తలు