IPL2021: ఎప్పుడు, ఎక్కడ, ఎలా...?

7 May, 2021 04:47 IST|Sakshi

ఐపీఎల్‌ మళ్లీ నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ

పరిశీలనలో విదేశీ ప్రత్యామ్నాయాలు

మా వద్ద ఆడమంటూ ఇంగ్లండ్‌ కౌంటీల ఆహ్వానం  

బీసీసీఐ అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రస్తుతానికి వాయిదా పడిందంతే. 2021 సీజన్‌ను రద్దు చేయలేదని బోర్డు ఉన్నతాధికారులు ఇప్పటికే వెల్లడించారు. లీగ్‌ నిర్వహణతో పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో మిగిలిన 31 మ్యాచ్‌లను కూడా నిర్వహించి టోర్నీని ముగించాలనేది బోర్డు ఆలోచన. అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే భారత్‌లో రాబోయే కొన్ని నెలల్లో కూడా ఇప్పట్లో కరోనా తగ్గిపోయి పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి మన దేశంలో మాత్రం జరగడం మాత్రం దాదాపు అసాధ్యం. అసలు బోర్డు ముందు అవకాశాలు, అనుకూల సమయం, సాధ్యాసాధ్యాలు  ఏమిటనే అంశాలను చూస్తే...         

యూఏఈలో అయితే...
ఐపీఎల్‌లో మరో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సాధ్యమైనన్ని సార్లు రోజూ రెండు మ్యాచ్‌లు నిర్వహించగలిగితే గరిష్టంగా మూడు వారాల్లో టోర్నీని ముగించవచ్చు. టి20 ప్రపంచకప్‌కు ముందుగానీ తర్వాతగానీ టోర్నీని నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. వేదిక అనగానే అన్నింటికంటే ముందు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పేరు వినిపిస్తోంది. ఇప్పటికే భారత్‌ నుంచి తరలించి టి20 ప్రపంచకప్‌ను కూడా ఇక్కడే జరపాలని భావిస్తున్న నేపథ్యంలో యూఏఈ అందరికీ అనుకూలంగా ఉంటుంది. పైగా 2020 ఐపీఎల్‌లో ఒక్క సమస్య కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించిన రికార్డు కూడా ఉంది. వరల్డ్‌కప్‌ ఇక్కడే ఉంటే బయో బబుల్‌లు మారాల్సిన సమస్య కూడా పెద్దగా ఉదయించదు.  

కరోనా కరుణిస్తేనే...
అన్నింటికి మించి కరోనా తీవ్రతనే ఐపీఎల్‌ నిర్వహణను శాసిస్తుందనేది వాస్తవం. టి20 ప్రపంచకప్‌ నిర్వహణకు కూడా ఇదే వర్తిస్తుంది. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. ఇంగ్లండ్‌లో టోర్నీ నిర్వహించినా... అక్కడి ఆంక్షలు, క్వారంటైన్‌ నిబంధనల కారణంగా వివిధ దేశాల క్రికెటర్లందరినీ అక్కడికి చేర్చడం అంత సులువు కాదు. దాదాపు అదే సమయంలో ప్రతీ జట్టుకు ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పినట్లు అన్ని క్రికెట్‌ బోర్డులతో మాట్లాడి ఇతర షెడ్యూల్‌ల విషయంలో కాస్త మార్పుచేర్పులు చేయగలిగితేనే ఐపీఎల్‌ జరుగుతుంది.   

ఇంగ్లండ్‌లో అయితే...
ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం సెప్టెంబర్‌ 14 వరకు భారత జట్టు ఆ దేశంలోనే ఉంటోంది. పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఇంగ్లండ్‌లోని లీగ్‌లలో ఆడుతుంటారు కాబట్టి పని సులువవుతుంది. సెప్టెంబర్‌లో తమ వద్ద ఐపీఎల్‌ నిర్వహించుకోవచ్చని, ఇదే విషయాన్ని బీసీసీఐతో మాట్లాడాలంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)కి పలు కౌంటీలు లేఖ రాశాయి. మిడిల్‌ఎసెక్స్, సర్రే, వార్విక్‌షైర్, లాంకషైర్‌ కౌంటీలు ఐపీఎల్‌ నిర్వహణ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే భారత్‌ కోణంలో చూస్తే ఇది అంత సులువైన విషయం కాదని... దీనిపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని కూడా ఈసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

సెప్టెంబర్‌ చివర్లో అయితే...
భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన తర్వాత, ఆ తర్వాత ప్రపంచకప్‌కు ముందు మిగిలిన పరిమిత సమయంలో టోర్నీని నిర్వహించడం పెద్ద సవాల్‌ కావచ్చు. అక్టోబర్‌ 16 నుంచి టి20 ప్రపంచకప్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. క్వారంటైన్‌ సమయం, వార్మప్‌ మ్యాచ్‌లు చూసుకుంటే సెప్టెంబర్‌ చివరి నుంచి జట్లు వరల్డ్‌కప్‌ వేదికలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌తో  సుదీర్ఘ సిరీస్, ఐపీఎల్, వరల్డ్‌కప్‌... ఇలా వరుసగా ఆడాలంటే భారత ఆటగాళ్లకే చాలా ఇబ్బంది. వారంతా కనీసం వారం రోజులు విశ్రాంతి ఆశిస్తారు. అప్పుడు రెండు వారాల సమయమే మిగులుతుంది. మరోవైపు అదే తేదీల్లో ఇంగ్లండ్‌... బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లనుంది.

నవంబర్‌ చివర్లో జరిగితే...
వరల్డ్‌కప్‌ ముగిసిన వెంటనే ఐపీఎల్‌ను నిర్వహించాలి. పరిస్థితులు మెరుగుపడితే మన దేశంలోనే జరపవచ్చు కూడా. అయితే విదేశీ ఆటగాళ్లు అందుబాటులోకి రావడం కష్టంగా మారిపోతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లకు నవంబర్‌ చివరి వారం నుంచి ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ఉంటుంది. భారత్‌కు కూడా వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌ ఈ సిరీస్‌ షెడ్యూల్‌ను కాస్త వెనక్కి జరిపే ప్రత్యామ్నాయం ఒకటి మిగిలి ఉంది. అయితే ఆసీస్, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు లేకుండా వేరే ఆటగాళ్లతో ముగించగలమని భావిస్తే నవంబర్‌ చివరి వారం ఐపీఎల్‌ నిర్వహణకు సరైన సమయం.

–సాక్షి క్రీడా విభాగం

మరిన్ని వార్తలు