బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే యోచనలో గంగూలీ.. ట్వీట్‌ వైరల్‌!

1 Jun, 2022 18:07 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌.. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ బుధవారం ట్విటర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ చేసిన వ్యాఖ్యలను చూస్తే త్వరలోనే దాదా పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాదా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

''2022 సంవత్సరంతో నా క్రికెట్‌ కెరీర్‌లో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1992లో క్రికెట్‌లో నా జర్నీ స్టార్ట్‌ అయింది. ఈ 30 ఏళ్లలో నాకు క్రికెట్‌ ఎంతో ఇచ్చింది.. నేను క్రికెట్‌కు ఎంతో సేవ చేశా. ముఖ్యంగా క్రికెట్‌ను ప్రేమించిన ప్రతీ వ్యక్తి నాకు మద్దతు ఇవ్వడం ఆనందంగా అనిపించింది. ఇంతకాలం నాకు సపోర్ట్‌ ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇక ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని ప్లానింగ్‌ చేయాలనుకుంటున్నా. ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నా. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న నాకు ఎప్పటిలాగే మద్దతు ఉంటుందని అనుకుంటున్నా అంటూ రాసుకొచ్చాడు.

ఇక గంగూలీ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో గంగూలీ రెండుసార్లు బేటీ కావడం పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమని వార్తలు వస్తున్నాయి. పొలిటికల్‌ ఎంట్రీ కోసం బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి గంగూలీ తప్పుకునే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గంగూలీ స్థానంలో ప్రస్తుత బీసీసీఐ సెక్రటరీ జై షా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా మే29న జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సమయంలోనే గంగూలీతో అమిత్‌ షా ‍ప్రత్యేకంగా బేటీ అయి రాజకీయ ఎంట్రీ గురించి సమాలోచన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి ధీటుగా పార్టీని తీర్చిదిద్దాలంటే గంగూలీ లాంటి వ్యక్తులు అవసరమని బీజేపీ భావించింది. అయితే దాదాను రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేస్తారా లేక కేంద్రంలో చక్రం తిప్పే పదవిని కట్టబెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా గంగూలీ తన కెప్టెన్సీతో టీమిండియాకు కొత్త కళను తీసుకొచ్చాడు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ కెప్టెన్‌గా పేరున్న గంగూలీ.. దాల్మియా బీసీసీఐ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏకచక్రాధిపత్యం చూపించాడు. ఇక 1992లో అంతర్జాతీ క్రికెట్‌లో అరేంగేట్రం​ చేసిన గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన సారధిగా గంగూలీకి పేరుంది. తన హయాంలోనే టీమిండియా విదేశాల్లో 11 టెస్టు విజయాలు నమోదు చేసింది. ధోని, కోహ్లి కంటే ముందు విదేశాల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గా గంగూలీ నిలిచాడు.

చదవండి: Krunal- Hardik Pandya: 'నిన్ను మరిచిపోయే స్టేజ్‌కు వచ్చారు.. గోడకు కొట్టిన బంతిలా'

మరిన్ని వార్తలు