రోహిత్‌ ఫిట్‌నెస్‌ 70%

14 Nov, 2020 04:53 IST|Sakshi

అందుకే టి20, వన్డేలకు విశ్రాంతి

విమర్శకులకు ఇవేవీ తెలియదు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ

ముంబై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదో టైటిల్‌ అందించిన కెప్టెన్, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ పరంగా ఇంకా వెనుకబడే ఉన్నాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు. ఓ ఆంగ్ల మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ ‘రోహిత్‌ ఇంకా 70 శాతమే ఫిట్‌గా ఉన్నాడు. అందుకనే ఈ స్టార్‌ ఓపెనర్‌ని వన్డే, టి20 జట్లకు ఎంపిక చేయలేదు. టెస్టు సిరీస్‌కు ఇంకా సమయం ఉండటంతో ఆలోపు పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకుంటాడనే సంప్రదాయ ఫార్మాట్‌కు ఎంపిక చేశాం. అయినా తన ఫిట్‌నెస్‌ గురించి అతడినే ఎందుకు అడగరు’ అని వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్‌ మధ్యలోనే ‘హిట్‌మ్యాన్‌’ గాయపడ్డాడు. గత నెల 18న పంజాబ్‌తో జరిగిన పోరులో రోహిత్‌ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో అతను తర్వాతి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తర్వాత కీలకమైన ప్లే ఆఫ్‌ దశకు ముందు మ్యాచ్‌ నుంచే జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఫైనల్లో అర్ధసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. అయితే ఈ సమయంలోనే గంగూలీ అతన్ని జాగ్రత్త పడమన్నాడు. ఈ ఐపీఎలే తన కెరీర్‌కు ఆఖరు కాదని, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచించాడు. రోహిత్‌లాంటి స్టార్‌ బ్యాట్స్‌మన్‌ను తొలగించలేదని, వైస్‌ కెప్టెన్‌ (పరిమిత ఓవర్ల ఫార్మాట్‌)కు విశ్రాంతి ఇచ్చామని అప్పట్లో దాదా చెప్పాడు. బోర్డు చీఫ్‌ సూచనల్ని ఏమా త్రం  లెక్కచేయని రోహిత్‌ ఫైనల్‌ సహా వరుసగా  మూడు మ్యాచ్‌లు ఆడాడు.

అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాస శిబిరంలో తన ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకున్నాక టెస్టుల కోసం ఆసీస్‌కు బయల్దేరతాడు. రోహిత్‌ను పక్కనబెట్టిన సెలక్టర్లు గాయపడిన వృద్ధిమాన్‌ సాహా ను ఆస్ట్రేలియాకు పంపడంపై వస్తున్న విమర్శలపై గంగూలీ సమాధానమిచ్చాడు. ‘సాహా టెస్టు సిరీస్‌కల్లా కోలుకుంటాడనే అతన్ని అక్కడికి పంపాం. ఐపీఎల్‌ ఆద్యం తం బోర్డు ట్రెయినర్లు, భారత జట్టు ఫిజియో డాక్టర్‌ నితిన్‌ పటేల్‌ దుబాయ్‌లోనే ఉన్నారు. ఆటగాళ్ల గాయాలు, తీరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. ఇవన్నీ జనాలకు తెలీదు. కాబట్టే ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తుంటారు. కానీ బోర్డు పనేంటో బోర్డు చక్కబెడుతుంది. గాయాలు ఆటగాళ్లకు తెలుసు, ఈ సమస్యల్ని ఎలా అధిగమించాలో ఫిజియోకు, ఎన్‌సీఏకు తెలుసు. సాధారణ ప్రజలకేం తెలుసు’ అని గంగూలీ విమర్శకుల్ని తూర్పారబట్టాడు.

మరిన్ని వార్తలు