దానికి గంగూలీ సరిపోడు: మాజీ కోచ్‌

31 Aug, 2020 15:22 IST|Sakshi

టీ20 ఫార్మాట్‌ సౌరవ్‌కు సెట్‌కాదు

జాన్‌ బుచానన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మెల్‌బోర్న్‌:  టీమిండియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీపై ఆసీస్‌ మాజీ కోచ్‌ జాన్‌ బుచానన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ క్రికెట్‌ జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు దూకుడు నేర్పిన కెప్టెన్‌గా పేరుగాంచిన గంగూలీకి టీ20 ఫార్మాట్‌ అనేది సెట్‌ కాదంటూ సుదీర్ఘ కాలం తర్వాత బుచానన్‌ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. గతంలో ఆసీస్‌ జట్టుకు సక్సెస్‌ఫుల్‌ కోచ్‌గా పని చేసిన బుచానన్‌.. గతంలో ఐపీఎల్‌లో కేకేఆర్‌ ఫ్రాంచైజీకి కోచ్‌గా పని చేశాడు. ఆ సమయంలో(తొలి సీజన్‌) గంగూలీ సారథ్యంలోని కేకేఆర్‌ ఆరోస్థానంలో నిలిచింది. బ్యాటింగ్‌లో విఫలమైన గంగూలీ, కెప్టెన్‌గా కూడా కేకేఆర్‌ను మంచి ఫలితాలను అందించలేకపోయాడు.  ఇక 2008, 2009 సీజన్లకు కేకేఆర్‌ కోచ్‌గా పనిచేసిన బుచానన్‌పై 2010 సీజన్‌ ఆరంభానికి ​ముందుగానే వేటుపడింది. (చదవండి: పాక్‌ అభిమానికి దిమ్మతిరిగే రిప్లై)

తాజాగా స్పోర్ట్స్‌ స్టార్‌తో మాట్లాడిన బుచానన్‌..  గంగూలీ అసలు టీ20 ఫార్మాట్‌కు సెట్‌కాడని వ్యాఖ్యానించాడు.  ‘ ఆ సమయంలో ఒక కెప్టెన్‌గా గంగూలీ త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌కు ఏది అవసరమో, ఆ తరహాలో నిర్ణయాలు తీసుకోవడంలో గంగూలీ విఫలమయ్యాడు. నేను చేసిన సూచనల్ని గంగూలీ సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. అంటే గంగూలీకి టీ20 ఫార్మాట్‌ సరిపోడనే విషయం నాకు అర్థమైంది’ అని బుచానన్‌ తెలిపాడు.  ఇక ఐపీఎల్‌ వంటి సుదీర్ఘ టోర్నీలకు కెప్టెన్లను మార్చడం అనేది ఒక మంచి ఆలోచన అని బుచానన్‌ తెలిపాడు. ఇలా కెప్టెన్లు మార్చడం వల్ల ఏ ఒక్కరిపైనా భారం పడకుండా ఉంటుందన్నాడు. ఎక్కువకాలం సాగే టోర్నీలకు ‘కెప్టెన్లు’ ఉండాలనే దానికి తాను కూడా మద్దతు తెలుపుతున్నానన్నాడు. 2003, 2007ల్లో ఆసీస్‌ వరల్డ్‌కప్‌ సాధించిన జట్టుకు బుచానన్‌ కోచ్‌గా ఉన్నాడు.(చదవండి: సీఎస్‌కే చేసిన పొరపాటు అదేనా?)

>
మరిన్ని వార్తలు