SA vs ENG: టాప్‌ స్కోరర్‌గా నిలిచి.. అంత గుడ్డిగా ఎలా ఔటయ్యాడు!

11 Aug, 2022 13:13 IST|Sakshi

దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే, టి20 సిరీస్‌లు ముగియగా.. ఆగస్టు 17 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది.  కాగా టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ లయన్స్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.  మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది.  ఇక బ్యాటింగ్‌లో ప్రొటిస్‌కు మంచి ప్రాక్టీస్‌ లభించింది.  సౌతాప్రికా తొలి ఇన్నింగ్స్‌లో 433 పరుగులకు ఆలౌటైంది.

సౌతాఫ్రికా తరపున కాయా జోండో 86 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వాండర్‌డుసెన్‌ 75, వెరిన్నె 62, మార్కో జాన్సెన్‌(54 నాటౌట్‌), సరెల్‌ ఎర్వీ 42 పరుగులు చేశారు. అయితే ప్రొటిస్‌ తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కాయా జోండో ఔటైన విధానం మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతసేపు నిలకడగా ఆడిన కాయా.. బంతి అంచనా వేయడంలో పొరబడి గుడ్డిగా ఔటవ్వడం ఆశ్చర్యపరిచింది.  ఇంగ్లండ్‌ లయన్స్‌ పేసర్‌ సామ్‌ కుక్‌ ఆఫ్‌స్టంప్‌ ఔట్‌సైడ్‌ దిశగా బంతిని వేయగా.. జోండో బంతిని వదిలేద్దామనుకున్నాడు. కానీ బంతి అనూహ్యంగా ఆఫ్‌స్టంప్‌ లైన్‌ మీదుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో కాయాకు కాసేపటి వరకు ఏం జరిగిందో అర్థం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 1-1తో సమం చేసింది. ఆ తర్వాత జరిగిన టి20 సిరీస్‌ను మాత్రం 2-1తో దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. ఇక మూడు టెస్టుల సిరీస్‌ ఇంగ్లండ్‌కు కీలకం కానుంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం సౌతాఫ్రికా టాప్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్‌ మాత్రం​ ఏడో స్థానంలో ఉంది.

చదవండి: Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్‌ హీరోయిన్‌కు పంత్‌ దిమ్మతిరిగే కౌంటర్‌

CWG 2022: కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న ఇ‍ద్దరు పాకిస్థానీ బాక్సర్ల అదృశ్యం

మరిన్ని వార్తలు