భారత్‌పై చివరి బంతికి గెలిచిన దక్షిణాఫ్రికా

22 Mar, 2021 05:01 IST|Sakshi
షఫాలీ వర్మ , లిజెల్‌ లీ

రెండో టి20లోనూ భారత మహిళల జట్టు ఓటమి

సిరీస్‌ 2–0తో సొంతం

షఫాలీ వర్మ, రిచా శ్రమ వృథా

లక్నో: ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేగిన రెండో టి20 మ్యాచ్‌లోనూ భారత అమ్మాయిల జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో వన్డే సిరీస్‌లాగే దక్షిణాఫ్రికా జట్టు ఇంకో మ్యాచ్‌ మిగిలుండగానే 2–0తో టి20 సిరీస్‌నూ కైవసం చేసుకుంది. ఓపెనర్‌ లిజెల్‌ లీ (45 బంతుల్లో 70; 11 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిలార్డర్‌ బ్యాటర్‌ లౌరా వోల్వార్ట్‌ (39 బంతుల్లో 53 నాటౌట్‌; 7 ఫోర్లు) చెలరేగారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (31 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిచా ఘోష్‌ (26 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించారు.

తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. దక్షిణాఫ్రికా గెలిచేందుకు ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులిచ్చింది. కానీ ఐదో బంతిని అరుంధతి నోబాల్‌గా వేయడం... దక్షిణాఫ్రికాకు 3 పరుగులు రావడంతో ఆ జట్టు విజయసమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారింది. ఐదో బంతికి 2 పరుగులు చేసిన వోల్వార్ట్‌ ఆఖరి బంతికి మిగిలున్న ఒక్క పరుగును కూడా సాధించి జట్టును గెలిపించింది. గాయం నుంచి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ స్మృతి మంధాన సారథ్యం వహించింది. రేపు ఆఖరి టి20 మ్యాచ్‌ జరుగుతుంది.  

నిరాశ పరిచిన స్మృతి  
తప్పక గెలిచి నిలవాల్సిన ఈ మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్‌ స్మృతి మంధాన (7) మళ్లీ నిరాశపరిచింది. తొలి ఓవర్లో బౌండరీ బాదిన ఆమె ఎంతోసేపు నిలువలేదు. దీంతో 8 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హర్లీన్‌ డియోల్‌తో కలిసి షఫాలీ ఇన్నింగ్స్‌ను నడిపించింది. నాలుగో ఓవర్లో షఫాలీ మూడు ఫోర్లు కొట్టింది. ఆరో ఓవర్లో బౌండరీతో పాటు లాంగాఫ్‌లో భారీ సిక్సర్‌ బాదింది. మరోవైపు డియోల్‌ కూడా అడపాదడపా ఫోర్లు కొట్టడంతో ఓవర్‌కు 7 పరుగుల చొప్పున రన్‌రేట్‌ నమోదైంది. పది ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 79/1 స్కోరు చేసింది. మరుసటి ఓవర్లో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా మరో సిక్సర్‌ కొట్టిన షఫాలీ అదే ఓవర్లో పెవిలియన్‌ చేరింది. తర్వాత జోరు తగ్గిన భారత్‌కు హర్లీన్‌ (31; 4 ఫోర్లు) రూపంలో మరో దెబ్బ తగిలింది.

రిచా ధనాధన్‌
ఈ దశలో క్రీజులోకి దిగిన రిచా ఘోష్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసింది. 14వ ఓవర్లో తన ఆటను బౌండరీలతో ప్రారంభించింది. ఆమె 3 ఫోర్లు, జెమిమా మరో బౌండరీ బాదడంతో లూస్‌ వేసిన ఆ ఓవర్లో ఏకంగా 18 పరుగులొచ్చాయి. ఇదే జోరును కొనసాగించడంతో స్కోరుబోర్డు జోరందుకుంది. ఓవర్‌కు ఒకటి, రెండు బౌండరీల చొప్పున ఆమె ధాటిగా ఆడింది. దీంతో భారత్‌ స్కోరు 150 పరుగులను అధిగమించింది.

లిజెల్‌ మెరుపులు
ఛేజింగ్‌లో రెండో ఓవర్లోనే ఓపెనర్‌ బాస్చ్‌ (2) వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టును లిజెల్‌ లీ మెరుపు ఇన్నింగ్స్‌ తో నిలబెట్టింది. కెప్టెన్‌ సునే లూస్‌ (21 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించింది. తర్వాత వోల్వార్ట్‌తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఈ క్రమంలోనే లిజెల్‌ 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా ధాటిగా ఆడిన లిజెల్‌ చేయాల్సిన రన్‌రేట్‌ను దించేసింది. ఎట్టకేలకు ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో రాధా యాదవ్‌ ఆమె సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు తెరదించింది.  లిజెల్‌ అవుటైనా చివరి వరకు వోల్వార్ట్‌ క్రీజులో నిలిచి దక్షిణాఫ్రికాను గెలిపించింది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు