T20 WC 2022: దురదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సౌతాఫ్రికా.. అయితే వర్షం.. లేకపోతే ఒత్తిడి..!

6 Nov, 2022 11:53 IST|Sakshi

క్రికెట్‌లో దురదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచే అర్హత ఉన్న జట్టు ఏదైనా ఉందంటే, అది సౌతాఫ్రికా జట్టేనని చెప్పాలి. నిత్యం దురదృష్టాన్ని పాకెట్‌లో పెట్టుకుని తిరిగే ఈ జట్టును మరోసారి అదృష్టం వెక్కిరించింది. టీ20 వరల్డ్‌కప్‌లో హాట్‌ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ప్రొటీస్‌ టీమ్‌.. ఇవాళ (నవంబర్‌ 6) పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో చిత్తుగా ఓడి సూపర్‌-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ ఒక్క ఓటమితో కప్‌ గెలిచే స్థాయి నుంచి అమాంతం పడిపోయి రిక్తహస్తాలతో ఇంటిముఖం పట్టింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అనవసరంగా ఒత్తిడికి లోనై ప్రత్యర్ధికి మ్యాచ్‌ను అప్పగించింది. తొలుత బౌలింగ్‌లో తడబడ్డ సఫారీలు.. ప్రత్యర్ధికి భారీ స్కోర్‌ చేసే అవకాశం ఇచ్చారు. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ తడబడి మ్యాచ్‌ను బంగారు పల్లెం పెట్టి ప్రత్యర్ధికి అప్పగించారు.

ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ సంచలన విజయం సాధించింది అనే దానికంటే, సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై ఓడిందనడం సమంజసమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒత్తిడికి లేకపోతే వరుణుడి శాపానికి బలి కావడం దక్షిణాఫ్రికాకు ఇదేమీ కొత్త కాదు. ప్రొటీస్‌ జట్టు కీలక టోర్నీల్లో చాలా సందర్భాల్లో ఈ రెండు కారణాల చేత గెలిచే మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

ఇదే ప్రపంచకప్‌లోనే జింబాబ్వేపై గెలవాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడి చావుదెబ్బ కొట్టాడు. నోటి కాడికి వచ్చిన మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగియడంతో.. దాని ప్రభావం ఇప్పుడు ఆ జట్టు సెమీస్‌ అవకాశాలను గల్లంతు చేసింది. అలా తొలుత వర్షం, ఇప్పుడు ఒత్తిడి దెబ్బకొట్టడంతో దక్షిణాఫ్రికా పెట్టా బేడా సర్దుకుని ఇంటికి పయనమైంది. 

సౌతాఫ్రికా విషయంలో గతంలో ఇలాంటి సందర్భాలు కోకొల్లలుగా జరిగాయి. వాటిలో 1992 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ అతి ముఖ్యమైనది. నాడు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడంతో 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన సౌతాఫ్రికా.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం అసాధ్యకరమైన రీతిలో ఒక్క బంతిలో 22 పరుగులు చేయాల్సి వచ్చింది.

అలాగే 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 3 బంతుల్లో ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. అలెన్‌ డొనాల్డ్‌ ఒత్తిడిలో చేసిన తప్పు కారణంగా సౌతాఫ్రికా మ్యాచ్‌ను చేజార్చుకుంది. 2015లో జరిగిన ఓ మ్యాచ్‌లోనూ 350కిపైగా టార్గెట్‌ను ఛేదించే క్రమంలో జోరుమీదున్న ఆ జట్టుకు వర్షం అడ్డుకట్ట వేసింది.

అప్పటిదాకా లక్ష్యం దిశగా సాగిన సౌతాఫ్రికా.. వరుణుడి ఆటంకంతో లయ తప్పి ఓటమిపాలైంది. ఇలా.. క్రికెట్‌ చరిత్రలో దక్షిణాఫ్రికాను చాలా సందర్భాల్లో బ్యాడ్‌లక్‌ వెంటాడింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమణతో ఆ జట్టుపై సోషల్‌మీడియలో భారీగా ట్రోల్స్‌ వస్తున్నాయి. సఫారీలకు దురదృష్టం అదృష్టం పట్టినట్లు పట్టిందని కొందరు, దురదృష్టానికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా దక్షిణాఫ్రికా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు