IPL 2022: ఐపీఎల్‌ నిర్వహణకు తహతహలాడుతున్న క్రికెట్‌ సౌతాఫ్రికా

25 Jan, 2022 15:58 IST|Sakshi

ఇటీవల దక్షిణాఫ్రికాలో భారత పర్యటన విజయవంతం కావడంతో క్రికెట్‌ సౌతాఫ్రికా మరో ప్రతిపాదనతో బీసీసీఐ ముందుకొచ్చింది. భారత్‌లో కరోనా ఉధృతి తగ్గకపోతే ఈ ఏడాది ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించాలని బీసీసీఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో క్రికెట్‌ సౌతాఫ్రికా కొన్ని ఆసక్తికర విషయాలను పొందుపరిచింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌ నిర్వహణ భారత్‌లో సాధ్యపడని పక్షంలో యూఏఈ కాకుండా తమ దేశంలో నిర్వహిస్తే బీసీసీఐకి లాభాల పంట పండుతుందని పేర్కొంది. 

యూఏఈతో పోల్చుకుంటే దక్షిణాఫ్రికాలో ఖర్చులు చాలా తక్కువనే లాజిక్‌ను చెప్పుకొచ్చింది. రవాణా, హోటల్‌ ఖర్చులు ఫ్రాంచైజీలకు కలిసొస్తాయని వివరించింది. కట్టుదిట్టమైన బయోబబుల్‌ ఏర్పాట్ల నడుమ నాలుగు వేదికల్లోనే లీగ్‌ను నిర్వహిస్తామని ప్రతిపాదించింది. గతంలో సౌతాఫ్రికాలో ఐపీఎల్‌ విజయవంతమైన విషయాన్ని గుర్తు చేస్తూ.. కరోనా బీభత్సంలోనూ ఇటీవలి భారత పర్యటన సక్సెస్‌ అయిన వైనాన్ని ప్రస్తావించింది. 

కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌ను ఎలాగైనా భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. అయితే, దేశంలో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి విపరీతంగా ఉండడంతో ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ నిర్వహణకు తొలి ఛాయిస్‌ భారత్‌ అయినప్పటికీ.. యూఏఈ, దక్షిణాఫ్రికా వేదికలను కూడా పరిశీలిస్తోంది. ఐపీఎల్‌ 2022 వేదికపై ఫిబ్రవరి 20 తేదీలోగా తేలుస్తామని ఐపీఎల్‌ జట్లకు సైతం ఇదివరకే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్‌ ఏప్రిల్‌ 2 నుంచి జూన్‌ 3 మధ్యలో జరగనున్న విషయం తెలిసిందే.
చదవండి: IPL 2022: అదే నా ప్లాన్‌.. ఆల్‌రౌండర్‌గానే...: హార్దిక్‌ పాండ్యా

మరిన్ని వార్తలు