డుప్లెసిస్‌ 199.. శ్రీలంక 180 

29 Dec, 2020 19:03 IST|Sakshi

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ విజయం

సెంచూరియన్‌: శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 45 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌లో 180 కుప్పకూల్చి ఇన్నింగ్స్‌ విజయాన్ని సఫారీలు నమోదు చేశారు. 65/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన లంకేయులు మరో 115 పరుగులు జత చేసి మిగతా ఎనిమిది వికెట్లను చేజార్చుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దెబ్బకు లంకేయులు చేతులెత్తేశారు. కుశల్‌ పెరీరా(64),  వానిందు హసరంగా( 59)లు మినహా మిగతా ఏ ఒక్కరూ ఆకట్టుకోలేదు.  లుంగీ ఎన్‌గిడి, అన్రిచ్‌ నోర్తేలు లంకను ఆరంభంలోనే దెబ్బ కొట్టడంతో ఆ జట్టు ఇక తేరుకోలేకపోయింది.

లంకేయులు తమ ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 621 పరుగులు చేసింది. ఇక్కడ డుప్లెసిస్‌ పరుగు తేడాతో డబుల్‌ సెంచరీ కోల్పోయాడు. డుప్లెసిస్‌ 199 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా టెస్టుల్లో 199 పరుగుల వద్ద ఔటైన 11వ బ్యాట్స్‌మన్‌గా డుప్లెసిస్‌ నిలిచాడు. కాగా, డుప్లెసిస్‌ తొలి ఇన్నింగ్స్‌లో కొట్టిన పరుగుల కంటే శ్రీలంక  తన రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు నమోదు చేయడం గమనార్హం. డుప్లెసిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. (రహానే ఖాతాలో స్పెషల్‌ మెడల్‌.. దాని ప్రత్యేకత ఏమిటి?)

>
మరిన్ని వార్తలు