డివిలియర్స్‌పై కీలక ప్రకటన చేసిన దక్షిణాఫ్రికా బోర్డు

19 May, 2021 01:20 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం లేదని ప్రకటించిన దక్షిణాఫ్రికా బోర్డు

జొహన్నెస్‌బర్గ్‌: విధ్వంసక బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున ఆడే అవకాశం ఉందంటూ గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలకు తెర పడింది. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయడం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ) అధికారికంగా ప్రకటించింది. రిటైర్మెంట్‌ను వదిలి మళ్లీ బరిలోకి దిగే విషయంలో అతనితో ఇటీవల బోర్డు అధికారులు చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు సఫారీ జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఏబీ గురించి ప్రకటన వెలువడింది. ‘రిటైర్మెంట్‌పై తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని, దానికే కట్టుబడి ఉన్నట్లు డివిలియర్స్‌ చెప్పాడు’ అని సీఎస్‌ఏ స్పష్టం చేసింది.  

దక్షిణాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న 37 ఏళ్ల డివిలియర్స్‌ అనూహ్యంగా 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  అప్పటి నుంచే అతని పునరాగమనంపై పదే పదే వార్తలు వచ్చాయి. నిజానికి 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడాలని అతను ఆశించినా... చివరి నిమిషంలో ఈ విషయం చెప్పడంతో బోర్డు ఏబీ విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ క్రికెట్‌లో డివిలియర్స్‌ చెలరేగుతుండటంతో జాతీయ జట్టు గురించి మళ్లీ ప్రస్తావన వచ్చింది.

అతని మాజీ సహచరులు గ్రేమ్‌ స్మిత్, మార్క్‌ బౌచర్‌లు బోర్డులో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున కచ్చితంగా ఆడతాడనే ప్రచారం జరిగింది. ఫామ్, ఫిట్‌నెస్‌ బాగుంటే వస్తానంటూ ఇటీవల ఐపీఎల్‌లో కూడా అతను తన ఉద్దేశాన్ని బయట పెట్టాడు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత పునరాగమనం విషయంలో బౌచర్‌తో చర్చించాల్సి ఉందని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు తాజా ప్రకటనతో అతని దక్షిణాఫ్రికా కెరీర్‌ ముగిసినట్లు స్పష్టమైపోయింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు