ప్రమాదంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌!

15 Oct, 2020 06:27 IST|Sakshi

నిషేధం విధించేందుకు సిద్ధమైన ప్రభుత్వం

కేప్‌టౌన్‌: బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలతో కుదేలైన దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) మరో ప్రమాదంలో పడనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనకుండా దక్షిణాఫ్రికా క్రికెట్‌పై నిషేధం విధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు క్రీడా మంత్రి నాతి మెథ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడంలో సీఎస్‌ఏకు సహకరించేందుకు పలుమార్లు సమావేశమైనప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదని మెథ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సీఎస్‌ఏ పాలనలో స్థిరత్వం తీసుకురావడానికి చాలా ప్రయత్నించాం. కానీ వారి నుంచి సహకారం అందలేదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇక వారితో ఎటువంటి సంప్రదింపులు చేయదల్చుకోలేదు’ అని ఆయన అన్నారు. తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలిపేలా తమ వాదనలు వినిపించాలని క్రికెట్‌ అధికారులకు మెథ్వీ అక్టోబర్‌ 27 వరకు గడువునిచ్చారు.   

మరిన్ని వార్తలు