WT20 WC 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సెలక్టర్లు.. ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాలేదని?

2 Feb, 2023 12:41 IST|Sakshi

దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డేన్ వాన్ నీకెర్క్‌కు సెలక్టర్లు బిగ్‌ షాకిచ్చారు. ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలమవకావడంతో వాన్ నీకెర్క్‌ను మహిళల టీ20 ప్రపంచకప్‌-2023కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

ఆమె స్థానంలో ఆల్‌రౌండర్‌ సునే లూస్‌ను తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్‌ ఎంపిక చేసింది. కాగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ ముందు వాన్ నీకెర్క్‌ కుడి కాలికి గాయమైంది. దీంతో ఆమె వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమైంది. అనంతరం ఆమె జట్టుకు దూరంగా ఉంటుంది.

క్రికెట్‌ సౌతాఫ్రికా న్యూ రూల్స్‌ ఇవే..
క్రికెట్‌ సౌతాఫ్రికా తీసుకొచ్చిన కొత్త ఫిట్‌నెస్ రూల్స్‌ ప్రకారం.. మహిళా జట్టుకు ఎంపిక కావాలంటే క్రికెటర్లు  కచ్ఛితంగా 9.3 నిమిషాల్లో 2 కి.మీ.ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. అయితే వాన్ నీకెర్క్‌ మాత్రం మరో 30 సెకన్లు అదనంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలక్టర్లు ఆమెను పక్కనపెట్టారు.

టీ20ల్లో అద్భుత రికార్డు..
టీ20ల్లో వాన్ నీకెర్క్‌కు మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో వాన్ నీకెర్క్‌ 1877 పరుగులతో పాటు 65 వికెట్లు కూడా పడగొట్టింది. అంతేకాకుండా టీ20ల్లో 1500లకు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఏకైక దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్‌ కూడా వాన్ నీకెర్కే కావడం విశేషం. 

గతేడాది కేప్‌తో స్వలింగ వివాహం
వాన్ నీకెర్క్‌ గతేడాది తన సహచర క్రికెటర్‌ మరిజాన్నే కేప్‌ని స్వలింగ వివాహం చేసుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన  జట్టులో కేప్‌కు మాత్రం చోటు దక్కింది. 

టీ20ల్లో సౌతాఫ్రికా తరుపున హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా కేప్ ఉంది. ఇక ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న జరగనున్న దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది.

టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా జట్టు:  అన్నరీ డెర్క్‌సెన్, సునే లూస్ (కెప్టెన్‌), మారిజాన్ కాప్, లారా గూడాల్, అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్, తజ్మిన్ బ్రిట్స్, మసాబాటా క్లాస్, లారా వోల్వార్డ్ట్, సినాలో జాఫ్తా, నాన్‌కులులేకో మ్లాబా
చదవండి: Shubman Gill: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్‌ రావాల్సిందే!

మరిన్ని వార్తలు