నాకూ గుర్తింపు కావాలి: తేవటియా

29 Sep, 2020 03:05 IST|Sakshi

ఒక్క ఇన్నింగ్స్‌తో తేవటియాపై అందరి దృష్టి 

మెరుపు బ్యాటింగ్‌తో సత్తా చాటిన లెగ్‌స్పిన్నర్‌ 

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా విధ్వంసం 

గతేడాది పాంటింగ్‌ వ్యంగ్య వ్యాఖ్యతో పెరిగిన కసి

గత ఏడాది ఐపీఎల్‌... ఆ ఘటనను రాహుల్‌ తేవటియా ఎప్పటికీ మరచిపోలేడు. అప్పుడతను ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌పై వాంఖడే స్టేడియంలో అద్భుత విజయం సాధించిన తర్వాత కోచ్‌ రికీ పాంటింగ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రసంగించాడు. మ్యాచ్‌లో విజయానికి కారణమైన పంత్, ఇంగ్రామ్, ధావన్, ఇషాంత్, బౌల్ట్, రబడ... ఇలా అందరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ వారిని అభినందించాడు. అది ముగిసిన తర్వాత పాంటింగ్‌ వెళ్లిపోతుండగా... తేవటియా అడ్డుగా వచ్చాడు. ‘నేనూ నాలుగు క్యాచ్‌లు పట్టాను. కాస్త నా గురించి కూడా చెప్పవచ్చుగా’ అని అడిగాడు.

దాంతో ‘ఇతను కూడా నాలుగు క్యాచ్‌లు పట్టాడుగా, ఇతడినీ అంతా అభినందించండి’... అంటూ పాంటింగ్‌ అలా గట్టిగా చెబుతూ వెళ్లిపోయాడు. ఇందులో ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించడంకంటే ఒక రకమైన వ్యంగ్యమే ఎక్కువగా కనిపించింది. సహచరులు కూడా అలాగే భావిస్తూ నవ్వారు. అక్షర్‌ పటేల్‌ అయితే ‘ఎవరైనా ఇలా అడిగి మరీ అభినందనలు చెప్పించుకుంటారా’ అని అనేశాడు. అయితే రాహుల్‌ తేవటియా మాత్రం తడబడలేదు. ‘మనకు దక్కాల్సిన గుర్తింపును హక్కుగా భావించి దాని కోసం పోరాడాల్సిందే’ అని జవాబిచ్చాడు. ఇది మాత్రం తేవటియా సరదాగా చెప్పలేదు. తననూ గుర్తించాలన్న కసి కనిపించింది.

ఇప్పుడు కాలం గిర్రున తిరిగింది. ఏడాది తర్వాత రాహుల్‌ తేవటియాకు తన గురించి తాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అతని గురించే మాట్లాడుకుంటోంది. ఇది అతను సాధించిన పెద్ద విజయం. టి20 వ్యూహాలు, ఫలితాల గురించి ఆలోచించకుండా అతని ఇన్నింగ్స్‌ను చూస్తే ఎంతటి కఠిన పరిస్థితుల్లోనూ పోరాటం ఆపరాదని, ఓటమిని అంగీకరించకుండా తనపై తాను నమ్మకం ఉంచాలనే లక్షణం 27 ఏళ్ల తేవటియాలో పుష్కలంగా ఉందని అర్థమవుతోంది.  

అటూ ఇటూ... 
రాహుల్‌ తేవటియా 2014 నుంచి ఐపీఎల్‌లో ఉన్నాడు. అప్పుడూ అతను రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ లీగ్‌ మధ్యలో అతడిని పంజాబ్‌ తీసుకుంది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ 2017లో ఐపీఎల్‌ ఆడే అవకాశం లభించింది. తర్వాతి సంవత్సరం మళ్లీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు వచ్చాడు. రెండు సీజన్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రాయల్స్‌తోనే అవకాశం. ఇంత కాలం ఎక్కడా ఆడినా అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 2019 ఐపీఎల్‌లోనైతే కేవలం 6.2 ఓవర్లు మాత్రమే వేసిన తేవటియా బ్యాటింగ్‌లో 22 బంతులు మాత్రమే ఆడగలిగాడు. ఏ రకంగా చూసినా ఇది అతను ఆశించింది కాదు.  
బ్యాటింగ్‌పై 

దృష్టి పెట్టి..
తేవటియాకు తన బలం, బలహీనతపై ఒక అంచనా వచ్చేసింది. తాను లెగ్‌స్పి న్నర్‌నే అయినా ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే చహల్‌ లేదా అమిత్‌ మిశ్రా స్థాయి తనది కాదు. కేవలం బౌలర్‌గానే జట్టులో ఉండేంత గొప్ప బౌలింగ్‌ కాదు. అందువల్లే అతని రాష్ట్ర జట్టు హరియాణాలో కూడా రెగ్యులర్‌గా తేవటియాకు అవకాశాలు రాలేదు. అందుకే తన బ్యాటింగ్‌పై అతను బాగా దృష్టి పెట్టాడు. భారీ షాట్లు ఆడటంపై తీవ్రంగా సాధన చేశాడు. రాయల్స్‌కు కూడా ఇలాంటి ఆటగాడి అవసరం కనిపించడంతో అతనికి అవకాశం లభించింది. రాజస్తాన్‌ టీమ్‌లో ఉన్న భారత ఆటగాళ్లలో బంతిని బలంగా బాదగల ఏకైక లెఫ్ట్‌ హ్యాండర్‌ తేవటియా మాత్రమే. అదే అతనికి అర్హతగా పని చేసింది.  

సూపర్‌ బ్యాటింగ్‌... 
లీగ్‌ ఆరంభానికి ముందు రాజస్తాన్‌ ఆడిన అంతర్గత ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో తేవటియా బ్యాటింగ్‌ పవర్‌ను కోచింగ్‌ సిబ్బంది పరిశీలించారు. అతను ఆదివారం మ్యాచ్‌ తరహాలో భారీ షాట్లు కొట్టగలడని ఆ బృందానికి తప్ప ఎవరికీ కనీస అంచనా కూడా లేదు. అందుకే నాలుగో స్థానంలో అతడిని పంపిన వ్యూహంపై అంతా విరుచుకుపడ్డారు. ఇక పరుగులు తీయకుండా అతను తీవ్రంగా ఇబ్బంది పడటం చూసి కొందరు జాలి కూడా పడ్డారు. కానీ తేవటియా తనపై తాను విశ్వాసం కోల్పోలేదు. సిక్సర్లతో విరుచుకుపడి తనేమిటో నిరూపించాడు.

చివరకు యువరాజ్‌ సైతం ‘ఆ ఒక్క బంతిని వదిలి పెట్టినందుకు సంతోషం’ అంటూ తన రికార్డు గురించి ప్రస్తావించాడంటే వాటి విలువేమిటో తెలుస్తుంది. ‘తేవటియా దూకుడు, బంతిని బలంగా బాదే శైలి గురించి నాకు బాగా తెలుసు. కెరీర్‌ తొలి మ్యాచ్‌లోనే అతను 90కి పైగా పరుగులు చేయడం నాకు గుర్తుంది. ఐపీఎల్‌తో అతడికి మంచి అవకాశం లభించింది. ఇకపై కూడా మరింత బాగా ఆడాలి’ అని తేవటియా తొలి కోచ్, భారత మాజీ వికెట్‌ కీపర్‌ విజయ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించాడు. (ఆ ఒక్క బంతి మిస్‌ చేసినందుకు థాంక్స్‌: యువీ)

జోరు కొనసాగించగలడా..
ఒక్క ఇన్నింగ్స్‌ తేవటియా స్థాయిని పెంచింది. ఇక అతనిపై కచ్చితంగా అంచనాలు పెరిగిపోతాయి. అదే తరహాలో ప్రతీ మ్యాచ్‌లో రాజస్తాన్‌ అతడి నుంచి ఇలాంటి ఆటను ఆశిస్తుంది. జట్టు ట్విట్టర్‌ అకౌంట్‌లో బయోలో కూడా ‘2020 రాహుల్‌ తేవటియాలాగా సాగాలని కోరుకుందాం’ అని మార్చింది. అంటే ఆరంభం ఎలా ఉన్నా ముగింపు బాగుండాలనే ఉద్దేశం కావచ్చు కానీ ఇది కూడా తేవటియాపై ఒత్తిడి పెంచుతుంది. అయితే అతను రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌ కాకపోవడం కొంత మేలు చేసే అంశం. అద్భుత బౌలర్‌ కాకపోయినా చెన్నైతో మ్యాచ్‌ లో కూడా 3 కీలక వికెట్లతో అతను ఆకట్టుకు న్నాడు. ఐపీఎల్‌కు కావాల్సింది ఇలాంటి ఆట గాళ్లే.  టి20ల్లో 155 స్ట్రయిక్‌ రేట్‌ ఉండగా... దేశవాళీ వన్డేల్లో కూడా 113 స్ట్రయిక్‌ రేట్‌ అంటే అతని దూకుడు ఈ ఒక్క ఇన్నింగ్స్‌కే పరిమితం కాదని అర్థం చేసుకోవచ్చు.  
– సాక్షి క్రీడా విభాగం  

మరిన్ని వార్తలు