వద్దు... మీరెవరూ రావొద్దు!

21 Mar, 2021 04:33 IST|Sakshi

విదేశీ ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణ

కరోనా నేపథ్యంలో ఐఓసీ నిర్ణయం  

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలను మనం జపాన్‌కెళ్లి చూద్దామంటే కుదరనే కుదరదు. మనమే కాదు... మరే దేశానికి చెందిన ప్రేక్షకులకు ఆ అవకాశం లేదు. చరిత్రలో తొలిసారి విదేశాలకు చెందిన ప్రేక్షకుల్లేకుండా ఒలింపిక్స్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) నిర్ణయించింది. శనివారం జపాన్‌ ప్రభుత్వం, టోక్యో అధికారులు, గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ, పారాలింపిక్‌ కమిటీ వర్గాలతో ఆన్‌లైన్‌ మీటింగ్‌ నిర్వహించిన ఐఓసీ ప్రేక్షకులపై తుది నిర్ణయం తీసుకుంది. జపాన్‌లో ఇప్పటివరకు ఎన్నో సర్వేలు నిర్వహించారు.

ప్రతి సర్వేలో 80 శాతానికి పైగా జపాన్‌ వాసులు విదేశీ ప్రేక్షకులు వస్తే కరోనా మహమ్మారి వ్యాప్తి అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. అంతేకాదు... సర్వేల్లో పాల్గొన్న మెజారిటీ ప్రజలు వారితో వైరస్‌ ఎక్కడ అంటుకుంటుందోనన్న బెంగతో అసలు ఒలింపిక్సే రద్దు చేయాలని కోరారు! ఈ నేపథ్యంలోనే జపాన్‌ కేంద్ర ప్రభుత్వంతోపాటు స్థానిక ప్రభుత్వాధికారులతో ఆన్‌లైన్‌లో సమావేశమైన ఐఓసీ ప్రేక్షకులపై స్పష్టత ఇచ్చింది. ఇదివరకే 6 లక్షల టికెట్లను విదేశీయులకు విక్రయించారు. ఇప్పుడు వారందరికీ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. టోక్యో ఒలింపిక్స్‌ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి.  
ఆన్‌లైన్‌ సమావేశంలో ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్, ఆర్గనైజింగ్‌ కమిటీ చీఫ్‌ హాషిమోటో

మరిన్ని వార్తలు