బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ.. బ్యాటర్‌ ఫ్యూజులు ఎగిరిపోయాయి..!

12 Feb, 2024 16:58 IST|Sakshi

క్రికెట్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ స్పిన్‌ బౌలర్‌ నమ్మశక్యంకాని రీతిలో బంతిని స్పిన్‌ చేసి బ్యాటర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కువైట్‌ పేరు గల జెర్సీతో కనిపించిన సదరు బౌలర్‌ టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ శైలిలో ఆఫ్‌ స్పిన్ బౌలింగ్‌ చేశాడు. 

ఆఫ్‌ స్టంప్‌ ఆవల పడిన ఫుల్‌టాస్‌ బంతి నమ్మశక్యంకాని రీతిలో లెగ్‌ స్టంప్‌ను గిరాటు వేసింది. బంతి స్పిన్‌ అయిన విధానం చూసి బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎలా స్పందించాలో తెలియక గమ్మున పెవిలియన్‌ బాటపట్టాడు. ఈ వీడియోని చూసిన వారంతా షేన్‌ వార్న్‌ బాల్‌ ఆఫ్‌ ద సెంచరీని మించిపోయిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోను బట్టి చూస్తే ఈ మ్యాచ్‌ ఏదో దేశవాలీ టోర్నీలో జరిగనట్లుగా తెలుస్తుంది. 

కాగా, 1993లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో షేన్‌ వార్న్‌.. మైక్‌ గ్యాటింగ్‌ను నమ్మశక్యంకాని రీతిలో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. వార్న్‌ వేసిన లెగ్‌ స్పిన్‌ బంతిని అంచనా వేయలేక గ్యాటింగ్‌ తికమకపడిపోయాడు. ఎక్కడో లెగ్‌ స్టంప్‌ అవతల పడిన బంతి గింగిరాలు తిరుగుతూ గ్యాటింగ్‌ డిఫెన్స్‌ను తప్పించుకుని ఆఫ్‌ స్టంప్‌ను తాకింది. ఈ బంతిని బాల్‌ ఆఫ్‌ ద సెంచరీగా పిలుస్తారు. 

ఇదిలా ఉంటే, దివంగత షేన్‌ వార్న్‌ ఇలాంటి బంతులను చాలా సందర్భాల్లో సంధించిన విషయం తెలిసిందే. 90వ దశకంలో షేన్‌ వార్న్‌ స్పిన్‌ మాయాజాలానికి బ్యాటర్లు బెంబేలెత్తిపోయేవారు. వార్న్‌ సంధించే బంతులను ఎలా ఆడాలో తెలియక తికమకపడిపోయేవారు. ఏ బంతి ఎక్కడ ల్యాండై ఎలా టర్న్‌ అవుతుందో అర్ధంకాక జట్టు పీక్కునేవారు. వార్న్‌ టెస్ట్‌ క్రికెట్‌లో రెండో అత్యధిక వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. వార్న్‌ 2022లో అనుమానాస్పద రీతిలో మరణించాడు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega