ICC WC: కోహ్లి కెప్టెన్సీలో గనుక నేను ఆడి ఉంటే.. ఇండియా 3 ప్రపంచకప్‌ టైటిళ్లు గెలిచేది!

19 Jul, 2022 13:40 IST|Sakshi
ప్రపంచకప్‌ ట్రోఫీతో అశ్విన్‌, శ్రీశాంత్‌, సురేశ్‌ రైనా, యాసఫ్‌ పఠాన్‌(PC: Sreesanth Twitter)

Sreesanth: టీమిండియా ఐసీసీ టోర్నీ గెలిచిన రెండు సందర్భాల్లో జట్టులో భాగమై మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌. మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ సాధించిన టీమిండియాలో అతడు సభ్యుడు. అయితే, స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా శ్రీశాంత్‌ కెరీర్‌ మసకబారిపోయింది.

ఈ నేపథ్యంలో నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్‌.. దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టినా.. జాతీయ జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో అతడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

ఇదిలా ఉంటే.. 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్‌ కోహ్లి సారథిగా విజయవంతమైనా.. పలు చిరస్మరణీయ విజయాలు అందించినా.. మేజర్‌ టోర్నీ మాత్రం గెలవలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీశాంత్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

నేనే గనుక జట్టులో ఉండి ఉంటే!
టైమ్స్‌ నౌతో మాట్లాడిన శ్రీశాంత్‌.. ‘‘ఒకవేళ నేను విరాట్‌ కెప్టెన్సీలో గనుక ఆడి ఉంటే.. కచ్చితంగా 2015, 2019, 2021 వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలిచేవాళ్లం’’ అని వ్యాఖ్యానించాడు. ఇక యార్కర్లు సంధించడంలో ప్రావీణ్యం ఉన్న ఈ 39 ఏళ్ల బౌలర్‌.. టెన్నిస్‌ బాల్‌తో యార్కర్లు వేయడం తన కోచ్‌ ప్రాక్టీసు చేయించారని తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్లుగా... బ్యాటర్‌ ఆటతీరును సరిగ్గా అంచనా వేయగలిగితే యార్కర్లు వేయడం సులువేనని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

ఈ విషయంలో బుమ్రా కూడా ఇదే చెబుతాడని పేర్కొన్నాడు. కాగా యార్కర్లు వేయడంలో స్పెషలిస్టు అయిన జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం టీమిండియాలో పేస్‌ దళానికి నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక శ్రీశాంత్‌ భారత్ తరఫున 27 టెస్ట్‌ల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు.  

ఇక 2007 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో ఫైనల్లో శ్రీశాంత్‌ 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. అయితే, మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో పాక్‌ ప్లేయర్‌ మిస్బా ఉల్‌ హక్‌ ఆడిన స్కూప్‌ షాట్‌కు శ్రీశాంత్‌ పట్టిన క్యాచ్‌తో ఇండియా విజయం ఖరారైన దృశ్యాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోయాయి. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ ఎనిమిది ఓవర్లు బౌలింగ్‌ చేసి 52 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

చదవండి: India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు, పూర్తి వివరాలు!
Virat Kohli: ఒక్క 20 నిమిషాలు చాలు.. కోహ్లి సమస్యను పరిష్కరిస్తా! నేను కూడా ఆ ఇబ్బంది ఎదుర్కొన్నా!

మరిన్ని వార్తలు